Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న హెచ్చరికలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ చేసే తాటాకు చప్పుళ్లకు ఇక్కడ ఎవరూ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏ అంశం మీదనైనా, ఎక్కడైనా చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని సీఎంకు సవాల్ విసిరారు. తెలంగాణ పొలిమేరల్లోకి రాకుండా తనను ఆపేవారు ఈ గడ్డపై ఇంకా పుట్టలేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
నా పుట్టుక.. చావు బీజేపీలోనే!: తన రాజకీయ జీవితంపై వస్తున్న ఆరోపణలను కిషన్ రెడ్డి పూర్తిగా తిప్పికొట్టారు. “నేను రేవంత్ రెడ్డిలా పది పార్టీలు మారలేదు. నా పుట్టుక, చావు.. రెండూ బీజేపీలోనే. నేనేంటో, నా వ్యక్తిత్వం ఏంటో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఎవరు ఎంతగా రెచ్చగొట్టినా నేను తొందరపడను. అన్నింటికీ సమయమే సరైన సమాధానం చెబుతుంది” అని పేర్కొన్నారు.
Also read-Tamil Nadu: టీవీకే ప్రభుత్వం కనీసం 3 నెలలైనా కొనసాగుతుందా?.. ఎం.కె.స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ముందు హామీలు నెరవేర్చు: వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి.. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై దృష్టి పెట్టాలని కిషన్ రెడ్డి సూచించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ముందుగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే ఇతర విషయాల గురించి మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డికి హితవు పలికారు.

