Sonam Wangchuk: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారం గత వారం రోజులనుండి దేశ రాజకీయాలను అతలాకుతలం చేస్తుంది. యువతకు మద్దతుగా జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆయనను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలోనూ ఆయన తన పోరాటాన్ని వీడకుండా ఆహారాన్ని తిరస్కరిస్తూ దీక్షను కొనసాగిస్తున్నారు. దీంతో దేశ రాజధానిలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సోనమ్‌కు మద్దతుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘పార్లమెంటు ముట్టడి’ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులను అడ్డుకునే క్రమంలో పోలీసులు బలప్రయోగానికి దిగడం పరిస్థితిని మరింత దెబ్బతీసింది.
మద్దతుగా ఇండియా’ కూటమి: విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి శ్రేణులు సైతం రోడ్డుపైకి వచ్చాయి. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే, అఖిలేష్ యాదవ్ వంటి అగ్రనేతలు నేరుగా ప్రధాని మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించడం దేశరాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. అయితే పోలీసులు ప్రతిపక్ష నేతలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విడుదల చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రధాని మోదీ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు. విద్యార్థుల నిరసన సెగ, ప్రతిపక్షాల ఐక్య పోరాటం, వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వంటి పరిణామాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడేశాయి.
Also Read-Rahul Gandhi : యువతపై లాఠీల విరుచుకుపాటు.. ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని రాహుల్ డిమాండ్!
రంగంలోకి దిగిన కేంద్ర మంత్రులు: పరిస్థితి చెయ్యిదాటకుండా నష్టనివారణ చర్యలకు దిగిన మోదీ సర్కార్ తన మంత్రులను రంగంలోకి దించింది. కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జేపీ నడ్డాలు అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లి సోనమ్ వాంగ్‌చుక్‌ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. అనంతరం వాంగ్‌చుక్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు, అలాగే విద్యార్థులు కోరుతున్న ప్రధాన డిమాండ్లను అంగీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

