సికింద్రాబాద్(తెలుగుప్రభ): సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి బోనాలు నేడు ఉదయం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో అమెరికా కాన్సులేట్ జనరల్ లారా ఈ విలియమ్స్ పాల్గొన్నారు.
పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రి శ్రీ పొన్నం: ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం మరియు పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి బోనాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయం చుట్టూ 2 కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులను అమలు చేస్తున్నారు.
బోనాల వేడుకల్లో అమెరికా కాన్సులేట్ జనరల్: తెలంగాణ ఆధ్యాత్మిక,సాంస్కృ తిక వైభవానికి ప్రతీకగా నిలిచే శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో అమెరికా కాన్సులేట్ జనరల్ లారా ఈ విలియమ్స్ పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక ఆహ్వానం మేరకు వేడుకలకు విచ్చేసిన ఆమెకు మంత్రి ఘన స్వాగతం పలికారు. అమెరికా కాన్సులేట్ జనరల్ లారా ఈ విలియమ్స్ సంప్రదాయబద్ధంగా శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ విశిష్టత, బోనాల పండుగ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమెకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృ తి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని, ఇది ప్రజల భక్తి విశ్వాసాలకు, సాంస్కృతిక వైభవానికి అద్దం పడుతుందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించే సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల ప్రత్యేకతతో పాటు, బోనం సమర్పణ అనంతరం నిర్వహించే సంప్రదాయ “రంగం” కార్యక్రమం విశిష్టతను కూడా కాన్సుల్ జనరల్‌కు వివరించారు. ఈ సందర్శన ద్వారా తెలంగాణ గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు అంతర్జాతీయ వేదికపై మరింతగా పరిచయం అవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అమెరికా కాన్సుల్ జనరల్ బోనాల ఉత్సవాల్లో పాల్గొనడం తెలంగాణ–అమెరికా మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అమ్మవారిని ఉదయం 7గంటలకు నగర్ సీపీ సజ్జనార్ కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, హైదరాబాదులోని అమెరికన్ కౌన్సిలేట్ జనరల్ డైరెక్టర్ లారా విలియమ్స్ తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
Also Read-Ujjaini Mahankali: మహంకాళి బోనాలు షురూ.. అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన మంత్రి పొన్నం



