US-Iran war: అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన ఈ దౌత్యపరమైన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం అర్ధంతరంగా పర్యటనను ముగించుకుని వెనుదిరిగింది.
నిబంధనలపై సడలని ఇరాన్: చర్చల అనంతరం జేడీ వాన్స్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రతిపాదించిన నిబంధనలను అంగీకరించేందుకు ఇరాన్ ఏమాత్రం సిద్ధంగా లేదని జేడీ వాన్స్ అన్నారు. “ఇరాన్ వైపు నుంచి సమస్య పరిష్కారానికి కావాల్సిన సానుకూల నిబద్ధత కనిపించడం లేదు. ఎలాంటి ఏకాభిప్రాయం కుదరకుండానే మేము వెనక్కి వెళ్తున్నాం” అని ఆయన ప్రకటించారు.
Also read-India: ఇరాన్‌ను వెంటనే వీడండి.. భారతీయులకు కేంద్రం హై అలర్ట్!
చాలా చెడు వార్త: పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో ఇస్లామాబాద్‌లో ఈ భేటీ జరిగింది. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదురుతుందని ఆశించినా.. ఇరాన్ కఠిన వైఖరితో చర్చలు ప్రతిష్టంభనకు గురయ్యాయి. ఈ చర్చలు విఫలం కావడం ‘చాలా చెడు వార్త’ అని అభివర్ణించిన వాన్స్.. తదుపరి కార్యాచరణ కోసం తమ బృందం తిరిగి అమెరికా వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ చర్చల వైఫల్యంతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

