ప్యాపిలి, తెలుగుప్రభ :వాల్మీకులు తమ న్యాయబద్ధమైన ఎస్టీ రిజర్వేషన్ సాధన కోసం ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్నారని, ఈ హక్కును సాధించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఎమ్.వి.ఆర్.పి.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పులికొండన్న స్పష్టం చేశారు. ఎస్టీ హోదా లభిస్తేనే వాల్మీకి సామాజిక వర్గం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సమానంగా రాణించగలదని ఆయన అభిప్రాయపడ్డారు.
హలో వాల్మీకి.. చలో ప్యాపిలి..
ఈ నేపథ్యంలో ఆగస్టు 14వ తేదీన ప్యాపిలి వద్ద చేపడుతున్న జాతీయ రహదారి దిగ్బంధన కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. “హలో వాల్మీకి.. చలో ప్యాపిలి” నినాదంతో సాగే ఈ పోరాటంలో రాజకీయాలకు అతీతంగా వాల్మీకులు, ప్రజా సంఘాల నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారిపై నిర్వహించే నిరసన ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వాల్మీకుల నినాదం బలంగా వినిపించాలని, ప్రభుత్వాల మెడలు వంచి ఎస్టీ జాబితాలో చేర్చే వరకు ఈ పోరాటాన్ని విశ్రమించేది లేదని ఆయన హెచ్చరించారు. తరతరాలుగా జరుగుతున్న అన్యాయానికి ముగింపు పలకాలంటే ఆగస్టు 14న ప్యాపిలికి వేలాదిగా తరలివచ్చి మన నిరసన గళాన్ని చాటాలని పులికొండన్న పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వాల్మీకి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

