HomeTop StoriesVande Mataram: స్వాతంత్య్ర వేడుకల్లో 'వందేమాతరం' వివాదం.. కాంగ్రెస్ సైగలపై బీజేపీ ఫైర్

Vande Mataram: స్వాతంత్య్ర వేడుకల్లో ‘వందేమాతరం’ వివాదం.. కాంగ్రెస్ సైగలపై బీజేపీ ఫైర్

ఢిల్లీ (తెలుగుప్రభ): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ జాతీయ గేయం ‘వందేమాతరం’ చుట్టూ దేశ రాజధానిలో తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకల సందర్భంగా వందేమాతరం ఆలాపనను ఆపాలని పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే సైగలు చేశారంటూ ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడగా, ఆ ఆరోపణలను కాంగ్రెస్ కొట్టిపారేసింది.

- Advertisement -

వైరల్ వీడియోలో ఏముంది?
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో వందేమాతరం పూర్తి వెర్షన్ ఆలపిస్తుండగా, సోనియా గాంధీ, ఖర్గే పక్కనున్న నేతలతో ఏదో మాట్లాడుతూ చేతులతో ఆపాలని సైగలు చేస్తున్నట్లు దృశ్యాలు కనిపించాయి. కాసేపటికి రాహుల్ గాంధీ సైతం అదే తరహాలో సైగ చేయడం వీడియోలో రికార్డు అయ్యింది. ఈ ఫుటేజీని విపక్ష విమర్శకులు, బీజేపీ నేతలు నెట్టింట పెద్ద ఎత్తున షేర్ చేయడంతో వివాదం రాజుకుంది.

బీజేపీ తీవ్ర ఆగ్రహం..
ఈ ఘటనపై హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం బీజేపీ ప్రతినిధులు స్పందిస్తూ… వందేమాతరం పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఈ దృశ్యాలు బట్టబయలు చేస్తున్నాయని విమర్శించారు. దేశ స్వాతంత్య్ర పోరాటానికి ప్రతీకగా నిలిచిన జాతీయ గేయాన్ని అవమానించేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరించారని మండిపడ్డారు.

ఆపమని చెప్పలేదు, కుర్చీ అడిగారు..
ఈ వివాదంపై సీనియర్ కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ వివరణ ఇచ్చారు. జాతీయ గేయాన్ని ఆపే ప్రయత్నం ఎవరూ చేయలేదని, వందేమాతరం పూర్తి వెర్షన్ అక్కడ ఆలపించారని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎక్కువ సమయం నిలబడలేక అసౌకర్యానికి గురవుతుండటంతో, ఆయన కూర్చోవడానికి కుర్చీ తీసుకురావాలని మాత్రమే సోనియా గాంధీ సైగ చేశారని, దీనికి వక్రభాష్యం చెబుతున్నారని కొట్టిపారేశారు. ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన అధికారిక వేడుకలకు ప్రొటోకాల్ కారణాలతో ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే హాజరుకాలేదు.

‘వందేమాతరం’ను కాంగ్రెస్‌ అవమానించింది..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో పూర్తి ‘వందేమాతరం’ ఆలాపనపై అభ్యంతరం వ్యక్తం చేశారంటూ కాంగ్రెస్‌పై విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) తీవ్ర ఆరోపణలు చేసింది. జాతీయ గేయాన్ని అవమానించినందుకు కాంగ్రెస్‌ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వీహెచ్‌పీ డిమాండ్‌ చేసింది. వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్‌ బన్సల్‌ ‘ఎక్స్‌’ వేదికగా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ‘వందేమాతరం’ విషయంలో కాంగ్రెస్‌ మరోసారి తన ‘‘బుజ్జగింపు, విభజనవాద ధోరణిని’’ బయటపెట్టిందని ఆరోపించారు. 80 ఏళ్ల తర్వాత తొలిసారిగా పార్లమెంట్‌, ఎర్రకోట నుంచి పూర్తి ‘వందేమాతరం’ మారుమోగుతుండగా, మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ అదే జాతీయ గేయాన్ని అవమానించిందని ఆయన విమర్శించారు. 1937లో ముస్లిం లీగ్‌ ముందు కాంగ్రెస్‌ తలొగ్గి ‘వందేమాతరం’ను విభజించిందని బన్సల్‌ ఆరోపించారు. ఇప్పుడు మరోసారి అదే బుజ్జగింపు, విభజన ధోరణిని ప్రదర్శించిందని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఘటన కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో జరగడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News