Vikram-1: భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. దేశంలోనే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఓ ప్రైవేట్ సంస్థ రూపొందించిన ‘విక్రమ్-1’ రాకెట్ శనివారం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ చారిత్రాత్మక ప్రయోగంలో భాగంగా ‘మిషన్ ఆగమన్’తో పాటు, విక్రమ్-1 రాకెట్‌ను రూపొందించిన సృష్టికర్తల సంతకాలను కూడా అంతరిక్షంలోకి పంపడం విశేషం.
35 నిమిషాలు ఆలస్యంగా నింగిలోకి దూసికెళ్లిన విక్రమ్-1: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుండి ఈ ప్రయోగం జరిగింది. షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం 11:30 గంటలకే ఈ రాకెట్ నింగిలోకి ఎగరాల్సి ఉంది. అయితే ప్రయోగానికి ముందు కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో శాస్త్రవేత్తలు వాటిని అత్యంత వేగంగా పరిష్కరించారు. దీంతో అనుకున్న సమయం కంటే 35 నిమిషాలు ఆలస్యంగా విక్రమ్-1 నింగి వైపు దూసుకెళ్లింది. పూర్తి భారతీయ పరిజ్ఞానంతో, ప్రైవేట్ భాగస్వామ్యంతో రూపొందిన ఈ రాకెట్ విజయం సాధించడంతో భారత రోదసి రంగంలో సరికొత్త అవకాశాలకు తలుపులు తెరిచినట్లయింది. ప్రయోగం విజయవంతం కావడం పట్ల శాస్త్రవేత్తలు, నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.

