Weather report: అధిక ఉష్ణోగ్రతతో పాటు ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లటి కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయం కంటే ముందే భారత్‌ను తాకనున్నట్లు ప్రకటించింది. సాధారణంగా జూన్ 1న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కానీ ఈసారి కాస్త ముందుగా.. అనగా మే 26 నాటికే కేరళాను తాకనున్నట్లు ఐఎండీ వెల్లడించింది.
21 ఏళ్లుగా ముందస్తు అంచనాలు: రుతుపవనాల రాకపై వాతావరణ శాఖ గత 21 ఏళ్లుగా ముందస్తు అంచనాలను ప్రకటిస్తోంది. ఈ ఏడాది వారు అంచనా వేసిన మే 26 తేదీకి నాలుగు రోజులు అటుగా లేదా ఇటుగా రుతుపవనాలు వచ్చే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రైతాంగంతో పాటు సామాన్య ప్రజల్లో హర్షం: ప్రస్తుతం అండమాన్ పరిసర ప్రాంతాల్లో వాతావరణం రుతుపవనాల పురోగతికి అనుకూలంగా ఉందని అన్నారు. అవి ఉత్తర దిశగా ముందుకు సాగే కొద్దీ ఆయా ప్రాంతాల్లో ఎండల తీవ్రత తగ్గి ఉష్ణోగ్రతలు అదుపులోకి వస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రుతుపవనాల ముందస్తు రాక సమాచారంతో అటు రైతాంగంతో పాటు సామాన్య ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.

