Weather Update: గత కొంతకాలంగా ఎండలు,తీవ్ర ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ ఓ చల్లని కబురు మోసుకొచ్చింది. ఏపీలోని దక్షిణ కోస్తా,రాయలసీమ ప్రాంతాలపై సముద్ర మట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
మరోవైపు అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు దాదాపు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
కోస్తాంధ్రలో వర్షాలు…
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో సెప్టెంబర్ 19 శనివారం సాయంత్రం నాటికి ఉత్తర అండమాన్ సముద్ర పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో ఈ వ్యవస్థ పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. క్రమంగా బలపడిన అనంతరం ఇది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వైపు వెళ్లే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రభావం కారణంగా వచ్చే వారం కోస్తాంధ్రలో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
పిడుగులు కూడా పడే అవకాశం..
సెప్టెంబర్ 17 గురువారం అల్లూరి, పోలవరం, కృష్ణా, గుంటూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈదురుగాలులతో కూడిన వర్షాలు వచ్చే సమయంలో బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
తెలంగాణలోనూ ఇదే వాతావరణ వ్యవస్థ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు ఉష్ణోగ్రతలు కొంత ఎక్కువగా ఉండటంతో పాటు ఉక్కపోత కొనసాగవచ్చు. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మారే అవకాశం ఉంది. దక్షిణ, పశ్చిమ, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ప్రత్యేకంగా నల్గొండ, నాగర్‌కర్నూలు జిల్లాల్లో రాబోయే రెండు నుంచి మూడు గంటల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

