- గ్రూపు రాజకీయాలతో కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు?
- సిద్ధిపేటలో రేవంత్ సభ ఎప్పుడో..!
- పార్టీకి తలనొప్పిగా మారిన కోవర్టులు?
- హరీశ్ కోటలో పాగా కోసం కాంగ్రెస్ పావులు..గ్రూపుల కాంగ్రెస్‌లో సాధ్యమేనా!?
- సీఎం పర్యటనపై సర్వత్రా ఆసక్తి
సిద్దిపేట(తెలుగుప్రభ): సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి సభ ముగిసింది.. ఇక అందరి చూపూ సిద్ధిపేట వైపే. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలాకాలో భారీ సభ నిర్వహించిన సీఎం.. తదుపరి అడుగు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట వైపు వేస్తుండటంతో జిల్లా రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. అక్టోబర్ మొదటి వారంలో సిద్ధిపేటలో సీఎం సభ నిర్వహించే అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో కసరత్తు సాగుతున్నట్లు ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి. అయితే.. సిరిసిల్ల తరహాలోనే సిద్ధిపేటలోనూ భారీ సభ నిర్వహించి రాజకీయంగా బలమైన సందేశం ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ కంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్యంగా తెలుస్తుంది. బీఆర్‌ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీశ్‌రావును సిద్ధిపేటలోనే కట్టడి చేసి… రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీ బలమైన నియోజకవర్గాల్లో తమ ఉనికిని చాటుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి పకడ్బందీగా, పక్కా ప్రణాళికతో వ్యూహాన్ని రచించి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వేస్తున్న అడుగులు చెప్పకనే చెబుతున్నాయి. అయితే, సిద్దిపేలో కాంగ్రెస్ పార్టీ బలం, నేతలు, కార్యకర్తల మధ్య కొరవడిన సంయమనంతో ఇదెంత వరకు సాధ్యమవుతుందన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మొదలైంది.
హరీశ్‌రావే ఫస్టు టార్గెట్..
సిరిసిల్ల సభలో సీఎం రేవంత్‌రెడ్డి కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని రాజకీయ విమర్శలు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. అదే క్రమంలో సిద్ధిపేటలో సభ నిర్వహిస్తే హరీశ్‌రావుపై ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారన్నదే ఇప్పుడు ప్రధాన ఆసక్తిగా మారింది. ఇటీవల అసెంబ్లీ చర్చల్లో భూ వ్యవహారాలకు సంబంధించి బీఆర్‌ఎస్ నేతలపై సీఎం చేసిన ఆరోపణల నేపథ్యంలో.. సిద్ధిపేట సభలోనూ భూములు, ఆస్తులు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత ప్రభుత్వ కార్యక్రమాలు వంటి అంశాలు రాజకీయ వేదికగా మారే అవకాశం ఉందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఆయా ఆరోపణలపై సంబంధిత నేతల వివరణలు, అధికారిక ఆధారాలు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, మొత్తంగా సీఎం రేవంత్‌రెడ్డి మాటలు, అడుగులు చూస్తుంటే మాత్రం బీఆర్‌ఎస్‌లో అందరికంటే మొదటి టార్గెట్ హరీశ్‌రావే కనిపిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది.
సిద్ధిపేట.. సిరిసిల్ల కాదు..
సిరిసిల్లలో సభ నిర్వహించినంత మాత్రాన అదే రాజకీయ ఫార్ములా సిద్ధిపేటలోనూ పనిచేస్తుందా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినట్లు తెలుస్తోంది. సిద్ధిపేటలో హరీశ్‌రావుకు ఉన్న రాజకీయ పట్టు, స్థానిక స్థాయిలో ఆయనకు ఉన్న సంబంధాలు, నియోజకవర్గ రాజకీయ నిర్మాణం వేరు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే సిద్ధిపేట సభను కేవలం బహిరంగ సభగా కాకుండా.. పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేసే కార్యక్రమంగా, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వేదికగా, స్థానిక రాజకీయ సమీకరణాలను మార్చే ప్రయత్నంగా మలచాలన్న ఆలోచన కాంగ్రెస్ వర్గాల్లో ఉన్నట్లు సమాచారం.
కాంగ్రెస్‌కు అసలు సవాలు ఇక్కడే..
బయట బలమైన బీఆర్‌ఎస్.. లోపల కాంగ్రెస్ గ్రూపులు. సిద్ధిపేటలో కాంగ్రెస్ ముందున్న ప్రధాన సవాలు ఇదేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. నియోజకవర్గంలో పార్టీకి చెందిన వివిధ వర్గాలు ఒకే వేదికపైకి వచ్చి సీఎం సభను విజయవంతం చేస్తాయా..? స్థానిక నాయకత్వం సమన్వయంతో పనిచేస్తుందా..? అన్నదే కీలకంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కొందరు కోవర్టులు ఉన్నారన్నది కొన్నేండ్లుగా ఇంటా, బయట బహిరంగంగా వినిపిస్తున్నమాట. దీంతో ఎవరు మనోడు, ఎవరు హరీశ్‌రావు మనిషి అనేది పార్టీ నాయకత్వంకు పెద్ద తలనొప్పిగా, సవాల్‌గా మారినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇది తేల్చే పనిలో పార్టీ రాష్ర్ట నాయకత్వం ఉన్నట్లు ఓ సీనియర్ నేత ‘తెలుగుప్రభ’తో మాట్లాడుతూ చెప్పారు. ఇదిలా ఉంటే, సీఎం సభకు భారీగా జనసమీకరణ చేయడం ఒక అంశమైతే.. ఆ సభ తర్వాత ఆ ఉత్సాహాన్ని క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి మలచడం మరో అంశం. ఈ రెండింటిలో కాంగ్రెస్ ఏ మేరకు ముందుకు వెళ్తుందన్నదే సిద్ధిపేటలో ఆ పార్టీ రాజకీయ వ్యూహానికి కీలకంగా మారనుంది.
హరీశ్–రేవంత్ మాటల యుద్ధానికి సిద్ధిపేట వేదికా..
గతంలోనే రేవంత్‌రెడ్డి, హరీశ్‌రావు మధ్య పరస్పర రాజకీయ సవాళ్లు, విమర్శలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు సీఎం స్వయంగా సిద్ధిపేటకు వచ్చి బహిరంగ సభ నిర్వహిస్తే.. ఈ మాటల యుద్ధానికి మరోసారి వేదిక సిద్ధమయ్యే అవకాశం ఉంది. సీఎం ఏ అంశాలను ప్రస్తావిస్తారు..? హరీశ్‌రావుపై ఏ రాజకీయ ఆరోపణలు చేస్తారు..? గత ప్రభుత్వంపై ఏ అంశాలను ప్రజల ముందుంచుతారు..? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధిపేటకు చేసిన పనులపై ఏం చెబుతారు..? స్థానికంగా భవిష్యత్ అభివృద్ధికి ఎలాంటి హామీలు ఇస్తారు..? అన్నది ఆసక్తికరంగా మారింది.
‘సభ’తో సరిపెడతారా.. వ్యూహం మార్చుతారా..
సిద్ధిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు సంబంధించిన చర్చ కేవలం సభ తేదీ, వేదిక చుట్టూనే తిరగడం లేదు. సభ అనంతరం నియోజకవర్గంలో కాంగ్రెస్ రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతోందన్నదే అసలు ప్రశ్నగా మారింది. సిద్ధిపేట మున్సిపల్ ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సిద్ధిపేటపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారిస్తే.. స్థానిక నాయకత్వాన్ని ఎలా సమన్వయం చేస్తుంది..? ఏ నేతకు ఏ బాధ్యత అప్పగిస్తుంది..? బీఆర్‌ఎస్ బలమైన గ్రామీణ నెట్‌వర్క్‌కు ఎలా ప్రతిస్పందిస్తుంది..? అన్న అంశాలు కీలకం కానున్నాయి. ఇప్పటికే సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై సీఎం దృష్టి సారించినట్లు రాజకీయ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో.. సిద్ధిపేట సభ కాంగ్రెస్‌కు మరో బహిరంగ సభ మాత్రమేనా..? లేక హరీశ్‌రావు కంచుకోటలో దీర్ఘకాలిక రాజకీయ వ్యూహానికి శ్రీకారం చుట్టే వేదికనా..? అన్నదే ఇప్పుడు సిద్దిపేట రాజకీయాల్లో అసలు హాట్‌టాపిక్.
సభ తేదీ ఖరారైతే క్లారిటీ వస్తుంది..
తెలంగాణ ఉద్యమాన్ని, ఆ తర్వాత పదేండ్ల పాటు అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ర్టాన్ని కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్ల రూపాయలు దోచుకుందనీ, ఆ కుటుంబం పాల్పడిన దోపిడీని, ప్రజలకు చేసిన మోసాలను ఎండగడతాననీ, ఆ ముగ్గుర్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. సిరిసిల్ల సభ జరిగి వారం రోజులు కావస్తున్నా…ఆ రాజకీయ ప్రసంగ వేడి ఇంకా రాష్ర్ట రాజకీయాలలో ముఖ్యంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య కాకరేపుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి సభ సిద్దిపేటలో ఈ నెల 5,6,7 తేదీలలో ఉంటుందంటూ పార్టీ నేతల నుంచి మీడియాకు లీకులు కూడా వచ్చాయి. అయితే, సభ తేదీ ఖరారైతే అన్నింటికీ క్లారిటీ వస్తుంది. సభలో సీఎం మాటలు వింటే అసలు వ్యూహం బయటపడుతుంది.. ఆ తర్వాతి రాజకీయ అడుగులే అసలు కథను చెప్పనున్నాయి..! చూడాలి మరి!

