HomeTop StoriesIND Vs PAK: టీ20 ప్రపంచకప్‌.. నేడు పాక్‌తో తలపడనున్న భారత్

IND Vs PAK: టీ20 ప్రపంచకప్‌.. నేడు పాక్‌తో తలపడనున్న భారత్

T20 World Cup: క్రికెట్ ప్రపంచంలో రసవత్తరమైన పోరుకు సమయం ఆసన్నమైంది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌లో.. నేడు పాక్‌తో భారత్‌ తలపడనుంది. గ్రూప్-1లో జరిగే ఈ మ్యాచ్ ఇరు జట్లకు టోర్నీలో మొదటిది కావడం విశేషం. పురుషుల జట్టు తరహాలోనే కొన్నేళ్లుగా పాక్‌పై స్పష్టమైన ఆధిపత్యం చలాయిస్తున్న భారత మహిళల జట్టు.. అదే జోరును కొనసాగిస్తూ ప్రపంచకప్‌ వేటను ఘనంగా ప్రారంభించాలని పట్టుదలతో ఉంది. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడిన హర్మన్‌ప్రీత్ సేన.. అదే ఊపుతో ఇప్పుడు పొట్టి కప్పును కూడా సొంతం చేసుకోవాలని చూస్తోంది.

- Advertisement -

విధ్వంసకర ఓపెనర్లు: గత వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్లను ఓడించిన భారత్.. ప్రస్తుతం పటిష్టంగా కనిపిస్తోంది.స్మృతి మంధాన, షెఫాలి వర్మ రూపంలో విధ్వంసకర ఓపెనర్లు జట్టుకు అండగా ఉన్నారు. మిడిలార్డర్‌లో జెమీమా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి అనుభవజ్ఞులు ఉన్నారు. వీరికి తోడుగా ఫినిషర్ రిచా ఘోష్‌తో బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. అంతేకాకుండా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఇటు బ్యాటుతో, అటు బంతితో కీలక పాత్ర పోషించనుంది. ఆమెతో పాటు తెలుగమ్మాయి శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్‌ల రూపంలో స్పిన్ విభాగం పటిష్టంగా ఉంది. పేస్ బౌలింగ్‌ విభాగాన్ని రేణుక సింగ్‌ ముందుండి నడుపనుంది.

కెప్టెనే ఆ జట్టు బలం: భారత్‌తో పోలిస్తే పాకిస్థాన్ బలం కాస్త తక్కువగానే కనిపిస్తోంది. స్పిన్ బౌలింగ్ ఆ జట్టుకు ప్రధాన బలం అయినప్పటికీ.. ఇంగ్లాండ్ పిచ్‌లపై అది ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది ప్రశ్నార్థకమే. కెప్టెన్ ఫాతిమా సనా ఆల్‌రౌండ్ ప్రదర్శనపైనే ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. బ్యాటింగ్‌లో ముబీనా అలీ, ఆలియా రియాజ్ కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటివరకు భారత్, పాకిస్థాన్ మహిళల జట్ల మధ్య 16 టీ20 మ్యాచ్‌లు జరగ్గా.. అందులో 13 మ్యాచ్‌ల్లో టీమిండియానే విజయం సాధించి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.

తుది జట్లు (అంచనా):

  • భారత్: స్మృతి మంధాన, షెఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), భార్తీ ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), శ్రేయాంక పాటిల్/నందని శర్మ, శ్రీ చరణి, రేణుక సింగ్, క్రాంతి గౌడ్.
  • పాకిస్థాన్: గుల్ ఫెరోజా, ముబీనా అలీ, నటాలియా, ఆలియా రియాజ్, ఫాతిమా సనా (కెప్టెన్), సైరా జబీన్, ట్యూబా హసన్, రమీన్ షమీమ్, సాదియా ఇక్బాల్, నష్రా సంధు, డయానా బేగ్.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News