- ఉపాధి కోసం రష్యా వెళ్లిన బిహార్ యువకుడితో విదేశీ యువతి ప్రేమ
- ప్రియుడి కోసం భారత్‌కు వచ్చిన రష్యన్ సుందరి జూలీ
- ఇరు కుటుంబాల అంగీకారంతో నవంబర్‌లో పెళ్లి పీటలెక్లనున్న జంట
పాట్నా(తెలుగు ప్రభ): ప్రేమకు కులమతాలు, ఆస్తిపాస్తులు, దేశ సరిహద్దులతో సంబంధం లేదని మరోసారి రుజువైంది. ఖండాంతరాలు దాటి వచ్చిన ఓ రష్యన్ యువతి.. తన ప్రియుడిపై ఉన్న గాఢమైన ప్రేమతో ఏకంగా మారుమూల బిహార్ గ్రామానికి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ విదేశీ ప్రేమకథ స్థానికంగానే కాక సర్వత్రా చర్చనీయాంశమైంది. బిహార్‌కు చెందిన రాహుల్ యాదవ్ ఉపాధి నిమిత్తం రష్యాకు వెళ్లారు. అక్కడ పనిచేస్తున్న సమయంలో రాహుల్, రష్యాకు చెందిన జూలీల మధ్య పరిచయం ఏర్పడింది. కాలక్రమేణా ఆ పరిచయం కాస్తా గాఢమైన ప్రేమగా మారింది.
అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రాహుల్ తిరిగి భారత్‌కు రావాల్సి వచ్చింది. ప్రియుడు దూరమవడాన్ని తట్టుకోలేకపోయిన జూలీ.. అతడి కోసం ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. రాహుల్ ఇండియాకు వచ్చిన ఆరు నెలల తర్వాత, ఏకంగా తన కుటుంబ సభ్యులతో కలిసి బిహార్‌లోని రాహుల్ ఇంటికి చేరుకుంది. రాహుల్ కుటుంబం ఆర్థికంగా సాధారణ స్థితిలో ఉండి చిన్న గుడిసెలో నివసిస్తున్నప్పటికీ.. జూలీ ఏమాత్రం వెనుకాడలేదు. తనకు సిరిసంపదలు ముఖ్యం కాదని, గుడిసెలోనైనా రాహుల్‌తో కలిసి సంతోషంగా జీవిస్తానని ఆమె మనసారా పేర్కొంది. విదేశీ యువతి చూపిన నిస్వార్థ ప్రేమకు చలించిన ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించారు. పెద్దల ఆశీస్సులతో నవంబర్ నెలలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటికానున్నారు.

