HomeTop StoriesYSRCP: కరవుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు...వచ్చేది వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వమే

YSRCP: కరవుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు…వచ్చేది వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వమే

అన్నమయ్య జిల్లా రాయచోటి, తెలుగు ప్రభ :గండికోట–వెలిగల్లు నీటి ప్రాజెక్టు పనులను కూటమి ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందిస్తామని రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి అన్నారు.

- Advertisement -

గాలివీడు మండలంలో వైఎస్ఆర్‌సీపీలో వివిధ హోదాల్లో బాధ్యతలు పొందిన వారికి గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే వాటర్‌గ్రిడ్‌ పనులకు సగం నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అప్పటి ప్రభుత్వమే పులివెందుల, రాయచోటి నియోజకవర్గాలను మోడల్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసి అభివృద్ధికి బాటలు వేసిందన్నారు. ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన పనులను ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిలిపివేయడం దురదృష్టకరమన్నారు.

రాయచోటి నియోజక వర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిది

2024 ఎంపీ ఎన్నికల్లో తనకు లభించిన మెజారిటీలో సగం రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచే వచ్చిందని మిథున్‌రెడ్డి గుర్తుచేశారు. రాయచోటి ప్రాంత ప్రజలు, వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకులు తనపై చూపిన ఆదరణ, అభిమానాన్ని జీవితాంతం మరచిపోలేనని, వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని అన్నారు.

ఇక రెండేళ్లే.. తర్వాత వైఎస్ఆర్‌సీపీదే అధికారం

కూటమి ప్రభుత్వ పాలనకు ఇక రెండేళ్ల కాలమే ఉందని మిథున్‌రెడ్డి అన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల బెదిరింపులు, దౌర్జన్యాలకు వైఎస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు.. మా తడాఖా ఏంటో రానున్న రోజుల్లో చూపిస్తాం అని స్పష్టం చేశారు. మాజీ ఎంఎల్ఏ గడికోట శ్రీకాంత్‌రెడ్డి రానున్న రోజుల్లో బలమైన రాష్ట్ర నాయకుడిగా ఎదుగుతారని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి వైఎస్ఆర్‌సీపీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు వైఎస్ఆర్‌సీపీ శ్రేణులకు కీలకమని, ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీ సత్తా చాటాలని ఆయన సూచించారు. ప్రజల అండతో స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఘన విజయాన్ని సాధించేలా ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని మిథున్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. అన్నీ నెరవేర్చామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గొప్పలు చెప్పుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ముప్పై నెలలు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ మేరకు అమలు చేశారో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

గాలివీడులో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారా..? ఒక్క కొత్త పక్కా భవనం మంజూరు చేశారా..? మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామన్న హామీ ఏమైంది..? 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ ఇస్తామన్న మాట ఏమైంది..? నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఏమైంది..? అంటూ వరుస ప్రశ్నలతో కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు.

కరవుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
రాష్ట్రంలో వర్షాలు లేక రైతాంగం తీవ్ర కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్నా ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైందని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. పంటలు చేతికొచ్చే పరిస్థితి లేక.. మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక రైతులు నష్టాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు వాటర్‌మ్యాన్ కాదు.. కరవుకు బ్రాండ్ అంబాసిడర్ అని శ్రీకాంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మదనపల్లె సమావేశంలో హార్టీకల్చర్ హబ్‌కు రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రకటించిన చంద్రబాబు.. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధిని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

హార్టీకల్చర్‌కు బాటలు వేసింది వైఎస్సార్
హార్టీకల్చర్, డ్రిప్ ఇరిగేషన్, వెలిగల్లు ప్రాజెక్టు తదితర అనేక అభివృద్ధి కార్యక్రమాలకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే బలమైన పునాది పడిందని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. హంద్రీ–నీవా, హార్టీకల్చర్‌కు తానే బ్రాండ్ అంబాసిడర్‌నని చెప్పుకునే ముందు.. రైతుల ప్రస్తుత పరిస్థితిని చంద్రబాబు పరిశీలించాలని సూచించారు.రైతులు కరవుతో అల్లాడుతుంటే.. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకే పరిమితమవుతోందని విమర్శించారు. గండికోట–వెలిగల్లు నీటి పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న వాటర్‌గ్రిడ్ పనులకు తమ ప్రభుత్వ హయాంలోనే మంజూరులు జరిగాయని స్పష్టం చేశారు.

ధరల భారంతో పేదల నడ్డి విరుస్తున్నారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకులు, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగి సామాన్యుడి జీవితం భారంగా మారిందని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.ఒకవైపు ధరల భారం.. మరోవైపు హామీల అమలులో జాప్యం.. ఇంకోవైపు రైతుల కష్టాలు.. ఇలా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి చంద్రబాబు రాజకీయంగా దగ్గరగా ఉంటున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదు
వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలు, బెదిరింపులు, అక్రమ కేసులు, అధికార బలంతో వేధింపులు కొనసాగుతున్నాయని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. పోలీసుల సహకారంతో కూటమి నేతలు చేస్తున్న రాజకీయ వేధింపులను తాము గమనిస్తున్నామని అన్నారు.నా 18 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఎవ్వరినీ చెడుగా మాట్లాడలేదు. అది మా పెద్దలు నేర్పిన సంస్కారం. కానీ మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్యాడర్ జోలికి వస్తే మాత్రం సహించేది లేదు’’ అని స్పష్టం చేశారు.అధికారం కోసం కాదు.. కార్యకర్తల కోసం పనిచేస్తాం. అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం’’ అని శ్రీకాంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు.

బీసీలపై చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో చట్టం చేయాలి
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు మాట్లాడుతున్నారని పేర్కొన్న శ్రీకాంత్‌రెడ్డి.. బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. బీసీలను మాటలతో కాకుండా చట్టపరమైన చర్యలతో ఆదుకోవాలని కోరారు.

కార్యకర్తల సంక్షేమమే మా బాధ్యత
అధికారం లేని సమయంలోనూ వైఎస్సార్‌సీపీపై నమ్మకంతో, అభిమానంతో పార్టీ కోసం నిలబడుతున్న ప్రతి కార్యకర్తకు తాము అండగా ఉంటామని అన్నారు. పార్టీ బలోపేతంతో పాటు క్యాడర్ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.పార్టీ గుర్తింపు కార్డులు పొందిన కార్యకర్తల్లో ఎవరైనా ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్ తన సొంత నిధుల నుంచి అందిస్తారని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. పార్టీ కార్యకర్తల సంక్షేమానికి వైఎస్సార్‌సీపీ అధినేత ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనమన్నారు.

స్థానిక ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి కార్యకర్త సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి, నాయకులు–కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయాలని కోరారు.
అధికారం లేకపోయినా పార్టీ కోసం నిలిచిన కార్యకర్తల రుణం తీర్చుకోవడమే తన లక్ష్యమని.. అభివృద్ధితో పాటు పార్టీ క్యాడర్ సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.వైఎస్ఆర్ సిపి స్టేట్ లీగల్ సెల్ కో ఆర్డినేటర్ జల్లా సుదర్శన్ రెడ్డి, మండల కన్వీనర్ మిట్టపల్లె యదుభూషన్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News