New York Mayor Zohran Mamdani: అమెరికా రాజకీయాల్లో ఎవ్వరూ ఊహించని, చరిత్రలో ఎన్నడూ చూడని పరిస్థితి ఆవిష్కరించబడింది. ఉగాండాలో జన్మించి, భారత మూలాలు కలిగిన 34 ఏళ్ల యువ రాజకీయవేత్త జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ సిటీ మేయర్‌గా గెలుపొందారు. మాజీ గవర్నర్ ఆండ్రూ కువోమోపై చారిత్రాత్మక విజయం సాధించిన ఆయన ఎన్నిక నగర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఇది దశాబ్దాల తర్వాత జరిగిన అత్యధిక ఓటర్ల టర్నౌట్ ఉన్న ఎన్నికగా గుర్తింపు పొందింది.
తాజా విజయంతో మమ్దానీ న్యూయార్క్‌కి మొట్టమొదటి ముస్లిం, దక్షిణాసియా మూలాలు కలిగిన.. అలాగే ఆఫ్రికాలో జన్మించిన మొదటి మేయర్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో విస్తృత చర్చకు దారితీసింది. సబ్‌వే రైలు తలుపులు తెరుచుకుంటూ “The next and last stop is City Hall” అని వినిపించే సన్నివేశం ఆయన ప్రయాణానికి ప్రతీకగా నిలిచింది. మమ్దానీ 34 ఏళ్ల వయస్సులోనే రాష్ట్ర అసెంబ్లీ సభ్యునిగా ఎదిగారు. ఆయన ప్రచారంలో ప్రధాన అంశాలు.. ఇల్లు అద్దెలు అందరికీ అందుబాటులో ఉండటం, ఆర్థిక న్యాయం, సామాన్య ప్రజల అభివృద్ధి వంటి ప్రజారంజకమైన కోరికలు ఉన్నాయి. తాను అమెరికాలోనే అత్యంత ఖరీదైన నగరాన్ని ప్రతి న్యూయార్కర్‌కు చేరువయ్యేలా మారుస్తానని ఎన్నికల రాత్రి ప్రకటించారు.
జోహ్రాన్ ప్రయాణం నిజంగా ప్రేరణాత్మకమైంది. ఉగాండా రాజధాని కంపాలాలో పుట్టి, బాల్యంలోనే కుటుంబంతో మాన్‌హాటన్‌కి వలస వెళ్లారు. అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి విద్యార్థి సంఘాల కార్యకలాపాల్లో పాల్గొన్నారు. తరువాత న్యూఇంగ్లాండ్‌లోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పొందాడు. హౌసింగ్ కౌన్సిలర్‌గా పనిచేశారు. ఇక్కడే ఆయనకు సామాజిక సమస్యల పట్ల అంకితభావం పెరిగింది.
ఇక భారతీయులతో మమ్దానీకి మరో బంధం ఉంది. జోహ్రాన్ తల్లి ప్రసిద్ధ దర్శకురాలు మీరా నాయర్. ఆమె‘Monsoon Wedding’, ‘Salaam Bombay!’ వంటి చిత్రాలతో ప్రసిద్ధి చెందారు. తండ్రి మహ్మూద్ మమ్దానీ ఉగాండాలోని ప్రముఖ శాస్త్రవేత్త, గుజరాత్ మూలాలున్న ఖోజా ట్వెల్వర్ షియా సమాజానికి చెందినవారు. ఈ మిశ్రమ వారసత్వం జోహ్రాన్‌కి విస్తృతమైన గుర్తింపును తీసుకువచ్చింది. ఫోర్బ్స్ ప్రకారం జోహ్రాన్ మమ్దానీ ఆస్తులు సుమారు 1.6 నుండి 2.5 కోట్ల రూపాయల మధ్య ఉంటాయి. ఉగాండాలో కుటుంబం కలిగిన భూమి, అసెంబ్లీ సభ్యుడిగా పొందిన జీతం ప్రధాన ఆదాయ మార్గాలుగా ఉన్నాయి.


