Madhya Pradesh: మనిషికి, మూగజీవాలకు మధ్య ఉండే స్వచ్ఛమైన అనుబంధానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనం. జంతువులపట్ల మనిషికి ఉన్న ప్రేమను చాటి చెప్పే ఘటన సంఘటన మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లాలో చోటుచేసుకుంది. భవానీ నగర్‌కు చెందిన రైతు నవల్ సింగ్ మాలవీయ తాను గత 20 ఏళ్లుగా కంటికి రెప్పలా పెంచుకుంటున్న ‘కటోరి’ (ఎలియాస్ చమేలి) అనే పెంపుడు మేక మృతి చెందింది. దీంతో ఆ రైతు కుటుంబం తల్లడిల్లిపోయింది. కన్నీరుమున్నీరుగా విలపించింది. అంతే కాకుండా దాన్ని కుటుంబ సభ్యురాలిగా భావించిన ఆ కుటుంబం.. మేక అంత్యక్రియలను అత్యంత ఘనంగా నిర్వహించారు.
ప్రయాగ్‌రాజ్‌లో మేక అస్థికల నిమజ్జనం: నవల్ సింగ్ మాలవీయ కుటుంబం ఈ మేకను కేవలం ఒక పెంపుడు జంతువుగా కాకుండా తమ కుటుంబంలోని ఆడబిడ్డలా చూసుకుంది. సుమారు రెండు దశాబ్దాల పాటు తమ ఇంట్లోనే ఒకరిగా మెలిగిన కటోరి మృతి ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. కటోరి మరణం తర్వాత ఆ కుటుంబం మానవతా విలువలకు పెద్దపీట వేస్తూ అన్నీ తానై సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించింది. పవిత్ర ప్రయాగ్‌రాజ్‌లో మేక అస్థికలను నిమజ్జనం చేసి, ప్రత్యేకంగా గంగా పూజలు నిర్వహించారు. మానవ ఆచారాల ప్రకారం మరణానంతరం నిర్వహించే సంప్రదాయ విందును బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా ఏర్పాటు చేశారు. మూగజీవాల పట్ల మనిషికి ఉండాల్సిన కరుణ, ప్రేమ ఎంతటి ఉన్నతమైనవో నవల్ సింగ్ మాలవీయ నిరూపించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ ఘటన స్థానికంగానే కాక సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

