AP Inter Board: విద్యార్థులు ఎంత చదివినా పరీక్షల సమయంలో కొంత టెన్షన్ పడటం సహజం. కొందరు విద్యార్థులు తమకష్టానికి తోడు దేవుడి ఆశీర్వాదం ఉండాలని దేవాలయాలకు వెళ్తారు. కానీ ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి ఏకంగా బోర్డు అధికారులకే ఫోన్ చేసి ప్రాధేయపడ్డాడు. అయితే అతడు బోర్డు అధికారులను ఏం అడిగాడు? దానికి వారు ఎలాంటి సమాధానం ఇచ్చారో తెలుసుకుందాం.
నన్ను పాస్ చేయండి సార్ ప్లీజ్: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడైన వేళ ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నానికి చెందిన ఓ విద్యార్థి తాను పరీక్షలు సరిగ్గా రాయలేదనే భయంతో వితం పని చేశాడు. ఏకంగా బోర్డు అధికారులకు ఫోన్ చేసి.. తనను ఎలాగైనా గట్టెక్కించాలని వేడుకున్నాడు. తాను పరీక్ష సరిగ్గా రాయలేదని వారికి తెలిపాడు. అందుకే ఆన్సర్ షీట్లలో డబ్బులు కూడా పెట్టాను.. వాటిని చూసైనా మార్కులు వేయాలని కోరాడు. దీంతో ఇంటర్ బోర్డు అధికారులు.. విద్యార్థి మాటలు విని అవాక్కయ్యారు.
అధికారుల కౌన్సెలింగ్: పరీక్షా సమయంలో ఏమీ గుర్తుకు రాకపోవడంతో గత్యంతరం లేక ఇచ్చిన ప్రశ్నాపత్రాన్నే మూడు సార్లు సమాధాన పత్రంలో నింపేసినట్లు ఆ విద్యార్థి నిజాయతీగా ఒప్పుకున్నాడు. విద్యార్థి ఆందోళనను గమనించిన బోర్డు అధికారులు అతడికి ఫోన్ లోనే ధైర్యం చెప్పారు. ఇలాంటి పనులు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని తెలిపారు. క్రమశిక్షణారాహిత్యం కిందకు వస్తుందని హెచ్చరిస్తూనే.. సున్నితంగా కౌన్సెలింగ్ ఇచ్చారు. త్వరలోనే నిర్వహించే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు బాగా చదువుకుని హాజరుకావాలని సూచించారు.
Also read-Sri Chaitanya: సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన శ్రీ చైతన్య స్కూల్స్
విద్యార్థి ఫలితం ఎలా వచ్చిందంటే: గురువారం విడుదలైన ఫలితాల్లో ఆ విద్యార్థి ఊహించినట్లుగానే ఫెయిల్ అయ్యాడు. సదరు విద్యార్థి ఫస్టియర్‌లో రెండు సబ్జెక్టులు.. సెకండియర్‌లో మూడు సబ్జెక్టులు తప్పినట్లు అధికారులు ధృవీకరించారు. అయితే ప్రస్తుతం విద్యార్థి బోర్డుకు కాల్ చేసిన ఉదంతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

