Car Catches Fire in Diwali Celebrations: దీపావళికి పదిరోజుల ముందు నుంచే టపాసుల సందడి మొదలైంది. సాయంత్రం అయితే చాలు.. ఆటంబాంబుల శబ్దాలతో దద్దరిల్లుతోంది. ఇక దీపావళి రోజు ఆ బాంబుల మోత గురించి మాటల్లో చెప్పలేము. చిన్నాపెద్దా సంబరాల్లో మునిగి తేలుతారు. అయితే టపాసులు కాల్చే క్రమంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా వాహనాల సమీపంలో బాణాసంచా కాలిస్తే పెద్ద ప్రమాదమే వాటిల్లుతుంది. చిన్న నిర్లక్ష్యం భారీ మూల్యాన్ని చెల్లించుకునేలా చేస్తుంది. తాజాగా హైదరాబాద్ పరిధిలో ఓ కారు కింద క్రాకర్ పేలి.. పెద్ద ఎత్తున నష్టం జరిగింది.
Also Read: https://teluguprabha.net/viral/irctc-action-after-viral-video-on-reused-food-containers/
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని P&T కాలనీలో ఆదివారం అర్ధరాత్రి యువత బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టపాసులు పక్కనే పార్క్ చేసి ఉన్న కారు కిందకు వెళ్లి పేలాయి. దీంతో ఒక్కసారిగా కారుకు మంటలు అంటుకుని.. పెద్ద ఎత్తున చెలరేగాయి. క్షణాల్లోనే వాహనం మొత్తం మంటలంటుకున్నాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రమాదంలో కారు వెనుక భాగం పూర్తిగా కాలిపోయింది. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, దీపావళి సందర్భంగా టపాసులు పేల్చే క్రమంలో నిర్లక్ష్యం వహిస్తే అది ఎలాంటి విపత్తుకు దారితీస్తుందనే దానికి ఈ ఘటన ఉదాహరణ. కావున ప్రజలు జాగ్రత్తలు వహిస్తూ వేడుకలు జరుపుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో వాహనాలను రోడ్లపై కాకుండా పార్కింగ్ ప్లేస్‌ల్లో ఉంచినట్లయితే ఇలాంటి ప్రమాదాలు జరగవు.


