Children Cleaning Classroom Viral Video: విద్యకు ఆలయంగా భావించే పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. స్కూల్‌కు వెళ్లి విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన చిన్నారులు పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. పలకా, బలపం పట్టాల్సిన చిట్టి చేతులు చీపురు పట్టుకుని చెత్తను తొలగిస్తున్నాయి. చక్కగా చదువు నేర్చుకుని ప్రయోజకులు కావాలని తమ పిల్లలను స్కూల్‌కు పంపించిన తల్లిదండ్రులకు అక్కడి దృశ్యాలు కలవరపాటుకు గురిచేశాయి.
Also Read: https://teluguprabha.net/technology-news/cyber-criminals-loot-the-amount-by-spreading-fake-links/
మధ్యప్రదేశ్‌లో ఛతర్‌పూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు క్లాస్‌రూమ్‌ను శుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. స్కూల్ యూనిఫాంలో ఉన్న కొందరు విద్యార్థులు చీపురు, తుడుపు కర్ర పట్టుకుని తమ చిట్టిచేతులతో తరగతి గదిని శుభ్రం చేస్తున్నారు. ఛతర్‌పూర్‌లోని కలెక్టర్ బంగ్లా ఎదుట ఉన్న డెరాపహడి పాఠశాలలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోంది.
చిన్నారులు తరగతి గదిని శుభ్రం చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. తమ పిల్లల దుస్థితి చూసి ఖంగు తిన్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువుకునే పిల్లలతో ఇలాంటి పనులు చేయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, గతంలోనూ ఛతర్‌పూర్‌లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. తరగతి గదిలో ఉపాధ్యాయుడు బెంచిపై నిద్రపోవడం అప్పట్లో వైరల్ అయింది.


