Chinese teen sells kidney for iphone: యువతలో ఐఫోన్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐఫోన్ కోసం కిడ్నీలు అమ్మేసిన ఉదాంతాలు కూడా ఎన్నో చూశాం. అయితే, ఇలాంటి చర్యకు పాల్పడిన ఓ యువకుడు ఇప్పుడు బోరున విలపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చైనాకు చెందిన ఓ యువకుడి జీవితంలో జరిగిన తప్పు 14 సంవత్సరాల తరువాత కూడా అతన్ని వెంటాడుతూనే ఉంది. ఆ వ్యక్తి తన యవ్వనంలో చేసిన తప్పుకు నేటికీ పరిణామాలను అనుభవిస్తూనే ఉన్నాడు. దాని ఫలితంగా జీవితాంతం బాధపడుతూనే ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. చైనాలో నివసిస్తున్న ఒక వ్యక్తి 17 సంవత్సరాల వయసులో చేసిన తప్పును సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం వైరల్గా మారింది.చైనా నివాసి వాంగ్ షాంగ్కున్ అనే వ్యక్తి కేవలం 17 సంవత్సరాల వయసులో ఇష్టంతో ఒక తప్పు చేశాడు. 2011లో వాంగ్ కు కేవలం 17 ఏళ్ల వయసులో అతను తన కిడ్నీలలో ఒకదాన్ని అక్రమ మార్కెట్లో 20,000 యువాన్లకు (సుమారు రూ. 2.5 లక్షలు) అమ్ముకున్నాడు. అతనికి ఎలాంటి వైద్య అత్యవసర పరిస్థితి లేదు. అయినా కిడ్నీ అమ్ముకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిది అంటే.. అప్పట్లో వాంగ్ లేటెస్ట్ ఐఫోన్ 4, ఐప్యాడ్ 2 కావాలని కోరుకున్నాడు. తన కిడ్నీని అమ్ముకోగా వచ్చిన డబ్బుల ద్వారా అతను ఈ రెండు కోరికలను తీర్చుకున్నాడు. తనకు ఒక కిడ్నీ సరిపోతుందని వాంగ్ భావించాడు. కానీ, తరువాత జరిగింది వాంగ్‌ను శాశ్వతంగా వికలాంగుడిని చేసింది.
సోషల్ మీడియాలో వైరల్..
ప్రస్తుతం 31 సంవత్సరాల వయస్సులో వాంగ్ పూర్తిగా వికలాంగుడయ్యాడు. అతని రెండవ కిడ్నీ కూడా ఫెయిల్ అయింది. అతను జీవితాంతం డయాలసిస్ యంత్రంపై ఆధారపడవలసి వచ్చింది. ఐఫోన్ 17 ప్రో ధరల పెరుగుదల కారణంగా చాలా మంది యువకులు మళ్ళీ అదే తప్పు చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో సోషల్ మీడియాలో వాంగ్ కథ మళ్లీ వైరల్ అయింది. వాస్తవానికి, ఐఫోన్ తాజా మోడల్ విడుదలైనప్పటి నుండి చాలా మంది యువకులు మానవ శరీర అవయవ అక్రమ రవాణాలో పాల్గొన్న ముఠాలను సంప్రదించారు. చాలా మంది యువకులు తమ కిడ్నీలను అమ్మడం ద్వారా ఐఫోన్‌లను కొనుగోలు చేయాలనుకుంటున్నారు. వాంగ్ కథ బహుశా అలాంటి వారికి మేలుకోలుపు లాంటిది. పేద కుటుంబానికి చెందిన వాంగ్ ఆన్‌లైన్ చాట్ రూమ్‌లో అవయవ అక్రమ రవాణాదారుడి మెసేజ్ చూసి మోసపోయానని చెప్పుకొచ్చాడు. ఆ అక్రమ రవాణాదారుడు ఒక కిడ్నీని అమ్మితే మీకు రూ.2,50,000 రూపాయలు లభిస్తాయి అనే ఆఫర్ చేయడంతో ఆశపడి తన రెండు కిడ్నీల్లో ఒకదాన్ని అమ్మేశాడు. హునాన్ ప్రావిన్స్‌లోని ఒక చిన్న పట్టణానికి వెళ్లి.. అక్కడ స్థానిక ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్నాడు. శస్త్రచికిత్స తర్వాత ఆ డబ్బు తీసుకొని వాంగ్ ఆపిల్ గాడ్జెట్‌లతో మెరుస్తూ ఇంటికి తిరిగి వచ్చాడు.


