Friday, December 12, 2025
Homeవైరల్Video: సామూహిక వివాహ వేడుకలో రచ్చ.. చిప్స్ కోసం ఎగబడ్డ జనం, వైరల్‌

Video: సామూహిక వివాహ వేడుకలో రచ్చ.. చిప్స్ కోసం ఎగబడ్డ జనం, వైరల్‌

Senior Citizens Rush for Chips video: సాధారణంగా చిరు తిళ్లు అంటే కొందరు చిన్న పిల్లలు ఎగబడతారు. ముఖ్యంగా చిప్స్‌ ప్యాకెట్స్‌ కని పిస్తే చాలు కొనే వరకు మారాం చేస్తుంటారు. కానీ, పెద్దవాళ్లు కూడా ఇలా స్నాక్స్‌ కోసం పోటీ పడితే వింతగా ఉంటుంది కదా.. ఓ సామూహిక వేడుక కార్యక్రమంలో చిప్స్‌ ప్యాకెట్స్‌ కోసం యువత, సీనియర్‌ సిటిజన్లు ఎగబడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో నవంబర్‌ 25న ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద 383 జంటలకు సామూహిక వివాహం రథ్ పట్టణంలోని బ్రహ్మానంద్ విద్యాలయ క్రీడా మైదానంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించారు. అతిథుల కోసం చిప్స్, ఆలూ బోండా, చౌమైన్‌ ఏర్పాటు చేశారు. ఈ వేడుక తర్వాత అతిథులు స్నాక్ కౌంటర్ల వైపు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో అక్కడ చాలా మంది కిందపడిపోవడంతో పాటు వేడి టీ పైన పడి ఓ చిన్నారికి గాయాలైనట్లు సమాచారం. 

Also Read: https://teluguprabha.net/international-news/trump-special-focus-on-green-card-holders-after-shooting-near-white-house/

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అధికారులు, భద్రతా సిబ్బంది ముందుగానే వెళ్లిపోవడంతో నిర్వహణలో వైఫల్యం కారణంగా ఈ పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది. వెంటనే క్షతగాత్రులకు స్థానిక అధికారులు వైద్య సహాయం అందేలా ఏర్పాట్లు చేశారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. 

కాగా, ఈ సామూహిక వివాహం కార్యక్రమంలో 380 హిందూ జంటలు, మూడు ముస్లిం జంటలకు వారి వారి సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి తంతు జరిగింది. ఒక్కో జంట నుంచి 20 మంది సభ్యులు మాత్రమే పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో వేడుకల తర్వాత స్నాక్స్ పంపిణీలో గందరగోళం చోటుచేసుకుంది. కొందరు చేతికి అందిన చిప్స్‌ ప్యాకెట్లు పట్టుకోగా.. మరికొందరు ఒకటి అయినా దొరక్కపోతుందా అని ప్రయత్నాలు చేయడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. 

Also Read: https://teluguprabha.net/editorial-telugu-prabha/delhi-pollution-crisis-kiran-bedi-urges-pmo-intervention/

ఈ వీడియో సోషల్‌ మీడియాలో చర్చకు దారితీసింది. ఈ సంఘటనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సామూహిక వివాహాల అనంతరం తదుపరి బాధ్యతల నుంచి అధికారులు నిష్క్రమించారా అంటూ కామెంట్స్‌లో మండిపడుతున్నారు. ఈ తరహా కార్యక్రమాల్లో ప్రభుత్వ పర్యవేక్షణను ప్రశ్నిస్తూ సంక్షేమ పథకానికే సిగ్గు చేటు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

ఉత్తరప్రదేశ్‌లో ‘సామూహిక వివాహాలు’ నిర్వహించడం ద్వారా వెనుకబడిన వర్గాల్లోని కుటుంబాల్లో ఖర్చులను భరించడం, సమాజ సంబంధాలను పెంపొందించడం ద్వారా వారికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకువచ్చారు. కానీ ఇలాంటి కార్యక్రమాల్లో జన సమూహాలు అధికంగా ఉండటం ద్వారా పర్యవేక్షణ సరిగా లేకపోతే తొక్కిసలాటలు, ఘర్షణలు చోటుచేసుకునే అవకాశం ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. 

పర్యవేక్షణ లోపం కారణంగా సంతోషకరమైన సందర్భంలో బాధాకర సంఘటనలు చోటుచేసుకున్నాయని నెటిజన్లు నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. భవిష్యత్తులో ఇలాంటి జనసమూహ కార్యక్రమాల్లో ఈ తరహా సంఘటనలు చోటుచేసుకుండా అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. క్యూ విధానం ఏర్పాటు చేసి వచ్చిన అతిథులను నిరాశ పర్చకుండా అంతా సక్రమంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News