Crush Recession: ఒకప్పుడు ప్రేమలో పడటం, ఎవరైనా నచ్చితే ఆ భావనను ఆస్వాదించడం ఎంతో మధురమైన అనుభూతి. కానీ నేటి డిజిటల్ యుగంలో ఆ ఆకర్షణే యువతకు పెద్ద భారంగా మారుతోంది. ఆఖరికి ఒకరిపై ఇష్టం పెంచుకోవడం కూడా పెద్ద ‘ఎమోషనల్ స్ట్రెయిన్’గా అనిపిస్తుండటంతో నేటి తరం సరికొత్త నిర్ణయం తీసుకుంటోంది. సరిగ్గా ఈ పరిణామాన్నే నిపుణులు ‘క్రష్ రిసెషన్’ అని పిలుస్తున్నారు.
ఏమిటీ ‘క్రష్ రిసెషన్’..?
ఆధునిక డేటింగ్ తెచ్చిపెడుతున్న సంక్లిష్టతలు, తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా నేటి జెన్-జీ (Gen-Z) తరం ప్రేమ వ్యవహారాలు, క్రష్‌ల జోలికి వెళ్లకుండా దూరంగా ఉండిపోవడాన్నే ‘క్రష్ రిసెషన్’ అంటారు. అంటే యువతలో ప్రేమ లేదా ఆకర్షణ లేకపోవడం అని కాదు.. ఆ రిలేషన్‌షిప్‌తో వచ్చే మానసిక భారాన్ని, డ్రామాను భరించే ఓపిక లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.
పెరుగుతున్న ఎమోషనల్ డ్రామా..
స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే క్షణాల్లో ఎవరితోనైనా కనెక్ట్ అయ్యే వెసులుబాటు వచ్చింది. కానీ ఈ డిజిటల్ లభ్యతే అసలు సమస్యగా మారింది. గంటల తరబడి మెసేజ్‌లకు అర్థాలు వెతకడం, స్పష్టత లేని సంబంధాలు, అవతలి వారి స్పందన కోసం నిరీక్షించడం వల్ల చిన్న ఆకర్షణ కూడా బహిరంగంగా ఒక పరీక్ష రాసినంత ఒత్తిడిని కలిగిస్తోంది. ప్రేమాయణాలు అనవసరమైన ‘ఎమోషనల్ అడ్మిన్’ వర్క్‌లా మారుతున్నాయని చాలామంది భావిస్తున్నారు. ఉద్యోగ, ఆర్థిక ఒడిదుడుకులతో ఇప్పటికే ఒత్తిడి ఎదుర్కొంటున్న నేటి తరానికి డేటింగ్ అనేది మరొక పెద్ద టాస్క్‌లా తోస్తోంది. రేపు విడిపోయి గుండెకోత మిగిల్చే బంధాల కోసం ముందుగానే ఎమోషనల్‌గా అలసిపోవడం ఎందుకనే ఆలోచన జెన్-జీలో బలంగా నాటుకుపోతోంది. సమస్య నచ్చిన వ్యక్తి (Crush) వల్ల కాదు. దాని వెనుక వచ్చే అనవసర మానసిక క్షోభ వల్లే అని గ్రహించిన నేటి యువత, ప్రశాంతమైన జీవితం కోసం ప్రేమ, డేటింగ్ వ్యవహారాలకు కాస్త దూరంగా ఉండటమే మేలని భావిస్తోంది.

