Online Food Order Viral News: ఓ ఫుడ్ ఆర్డర్ యాప్ నుంచి పెరుగన్నం ఆర్డర్ చేసిన కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. పార్శిల్ ఓపెన్ చేసి ఫుడ్ బాక్స్‌లో ఉన్న ఐటమ్స్ చూసి ఖంగుతిన్నాడు. హైదరాబాద్‌లో ఈ సంఘటన చోటుచేసుకోగా సదరు కస్టమర్.. తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
అరచేతిలోకి ఫుడ్ డెలివరీ యాప్‌లు వచ్చాక నిమిషాల్లో కోరుకున్న ఫుడ్ ఇంటి ముందుకు వచ్చి చేరుతోంది. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఈ యాప్‌లకు పోటీ ఎక్కువే. అయితే గత కొన్ని రోజులుగా హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు వేగవంతం చేశాక.. ఒళ్లు గగుర్పొడిచే సంఘటనలు చోటుచేసుకున్నాయి. కిచెన్‌లో శుభ్రత లేకపోవడం, ఆహార పదార్థాల్లో నాణ్యత లోపించడం ఇలాంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. అయినప్పటికీ ఫుడ్ డెలివరీ యాప్‌ల్లో ఆర్డర్లు మాత్రం తగ్గడం లేదు.
Ordered curd rice from Rice Bowl, Kondapur, Hyderabad via @zomato in Hyderabad & shockingly found uncooked chicken pieces + paper inside 🤢
This is a serious food safety violation! Requesting action from @FoodsafetyTS @CommissionrGHMC @hydcitypolice @cyberabadpolice
#FoodSafety pic.twitter.com/cltO8ySvgc— Aditya Irri (@adityairri) September 12, 2025
వండని చికెన్, కాగితం
హైదరాబాద్‌లోని కొండాపూర్‌కు చెందిన కస్టమర్.. ఓ ఫుడ్ డెలివరీ యాప్ నుంచి ఓ రెస్టారెంట్ ద్వారా పెరుగన్నం ఆర్డర్ పెట్టుకున్నాడు. అయితే ఇంటికి ఆర్డర్ వచ్చాక తెరిచి చూస్తే అందులో వండని చికెన్ ముక్కలు, కాగితం కనిపించడంతో ఖంగు తిన్నాడు. వెంటనే ఈ విషయాన్ని తన ‘X’ ఖాతాలో పోస్ట్ చేశాడు. సదరు ఫుడ్ డెలివరీ యాప్, జీహెచ్‌ఎంసీ, తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌లకు ట్యాగ్ చేశాడు.
స్పందించిన జీహెచ్‌ఎంసీ
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే జీహెచ్ఎంసీ స్పందించింది. మీ సమస్యపై స్పందించామని.. అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామని సమాధానం ఇచ్చింది. సదరు ఫుడ్ డెలివరీ యాప్ కూడా కస్టమర్‌కు క్షమాపణలు చెప్పి, ఆర్డర్ వివరాలు పంపమని విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్ లాంటి టెక్ నగరంలో జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ యాప్‌లకు డిమాండ్ ఎక్కువే. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు వారి పని ఒత్తిడి కారణంగా ఎక్కువగా వీటిపైనే ఆధారపడుతుంటారు. అయితే ఫుడ్ డెలివరీల్లో కస్టమర్లు ఎదుర్కొన్న చేదు అనుభవాలు ఇప్పటికే చాలా చూశాం.
Also Read: https://teluguprabha.net/telangana-news/maoist-sujathakka-surrender-to-police/
నాణ్యత తప్పనిసరి
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కిలోల కొద్దీ చికెన్, మటన్‌ను నిల్వ ఉంచడం, శుభ్రత పాటించకపోవడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఈ క్రమంలో కస్టమర్లకు నాణ్యమైన సర్వీస్‌ను అందించడంలో రెస్టారెంట్లతో పాటు సదరు ఫుడ్ డెలివరీ యాప్‌లు నిర్లక్ష్యం వహించకూడదని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు.


