Deepavali Village Story:శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుండి శ్రీకూర్మం వైపు వెళ్తుంటే, సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న విశిష్టమైన గ్రామం కనిపిస్తుంది. ఆ ఊరిపేరు ‘దీపావళి’. పేరు విన్నవారికి మొదట ఆశ్చర్యం కలిగిస్తుంది, కానీ ఆ పేరుకు వెనుక ఒక చారిత్రాత్మక కారణం దాగి ఉంది.
లక్ష్మీనారాయణ ఆలయం..
కాలం చక్రం వెనక్కు తిప్పితే, పూర్వం ఒక కళింగ రాజు శ్రీకాకుళం నుండి కళింగపట్నం వైపు ఈ దారిలో ప్రయాణించేవారని చెబుతారు. ఆయనకు మార్గమధ్యంలో ఉన్న లక్ష్మీనారాయణ ఆలయం ఎంతో ప్రీతిపాత్రం. ప్రతి ప్రయాణంలోనూ ఆ ఆలయాన్ని సందర్శించి, పూజలు చేసుకునేవారని స్థానికులు చెబుతుంటారు.
Also Read:https://teluguprabha.net/devotional-news/deepavali-2025-dos-and-donts-for-diwali-puja-in-telugu/
బావి నుండి నీళ్లు..
ఒకసారి కూడా అలాగే పూజలు పూర్తిచేసి తిరుగు ప్రయాణం మొదలుపెట్టిన రాజు గుర్రంపై నుండి జారి పడిపోయి స్పృహ కోల్పోయారు. చుట్టుపక్కల గ్రామస్తులు పరుగున వచ్చి, ఆలయ సమీపంలోని బావి నుండి నీళ్లు తెచ్చి రాజుకి ఇచ్చారు. కొంతసేపటికి ఆయనకు స్పృహ వచ్చింది. ఆ సంఘటన యాదృచ్ఛికంగా జరిగిన రోజు దీపావళి పండుగ రోజే.
దీపావళి’…
రాజు ఆరోగ్యంగా ఉన్న తరువాత ఆయనను రక్షించిన గ్రామస్థుల పట్ల కృతజ్ఞతతో నిండిపోయారు. ఆయన ఆ గ్రామానికి పేరు ఏమిటని అడిగితే, అప్పట్లో ఆ ఊరికి ప్రత్యేక పేరు లేదని గ్రామస్థులు తెలిపారు. అప్పుడు రాజు చిరునవ్వుతో, “ఈరోజు దీపావళి, మీరు నాకు నీళ్లు ఇచ్చి ప్రాణం కాపాడారు. అందుకే ఈ ఊరికి ‘దీపావళి’ అని పేరు పెట్టాలి” అని అన్నారు.
తొమ్మిది వందల కుటుంబాలు..
ఆ రోజు నుంచి ఆ గ్రామం ‘దీపావళి’గా ప్రసిద్ధి చెందింది. తరువాత కాలంలో ప్రభుత్వ రికార్డుల్లో కూడా అదే పేరుతో నమోదు అయింది. ఈరోజు కూడా రెవెన్యూ రికార్డులలో ఆ గ్రామం పేరు ‘దీపావళి’గానే ఉంది.దీపావళి గ్రామం ప్రస్తుతం గోంటి పంచాయితీ పరిధిలో ఉంది. దాదాపు తొమ్మిది వందల కుటుంబాలు నివసించే ఈ ఊరులో సుమారు రెండు వేల ఓటర్లు ఉన్నారు. పేరు విన్నవారికి ఒక పండుగ గుర్తుకు వస్తుందేమో కానీ, ఈ గ్రామ ప్రజలకు అది వారి రోజువారీ గుర్తింపు.
పండగ పేరునే మీ ఊరుకి పెట్టారా?..
ఈ గ్రామం పేరు స్థానికంగా అందరికీ తెలిసినా, జిల్లాలోని ఇతర ప్రాంతాల వారు విన్నప్పుడు ఆశ్చర్యపోతారు. కొందరు నవ్వుతారు, ఇంకొందరు ఆశ్చర్యంతో మళ్లీ అడుగుతారు. తమ ఊరు పేరు చెబితే, “పండగ పేరునే మీ ఊరుకి పెట్టారా?” అంటూ నవ్వుతూ ప్రశ్నించే వారిని గ్రామస్థులు ఆసక్తిగా చూస్తారు.
గ్రామ యువత చెబుతున్నట్టు, బయట ఊర్లలో ఉద్యోగాలు లేదా చదువు కోసం వెళ్తే, “దీపావళి గ్రామం నుండి వచ్చాం” అని చెప్పగానే విన్నవారు సంతోషపడతారట. కొందరు అది సరదాగా తీసుకుంటే, మరికొందరు పండుగలా ప్రకాశించే ఊరుగా ఊహిస్తారట.
Also Read:https://teluguprabha.net/devotional-news/vastu-rules-to-follow-on-diwali-for-prosperity-and-luck/
గ్రామ మహిళలు చెబుతున్నట్టు, “మా ఊరికి పండుగ పేరే ఉండటం మాకు గర్వంగా ఉంటుంది. ప్రతి రోజు ఇక్కడ వెలుగు, ఆనందం, శుభం నిండుగా ఉంటాయి” అంటున్నారు.
పేరు వెనుక కథ మాత్రమే కాదు, ఈ ఊరు ఇప్పుడు పర్యాటకులకూ ఆకర్షణగా మారింది. లక్ష్మీనారాయణ ఆలయం చుట్టూ ప్రశాంత వాతావరణం, పచ్చదనం, గ్రామం మధ్యలో ఉన్న పాత బావి, ఇవన్నీ ఆ కాలపు చరిత్రను గుర్తు చేస్తాయి.
స్థానిక పెద్దలు చెబుతున్నట్టుగా, దీపావళి గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లో పండుగ రోజున ప్రత్యేకంగా దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. గ్రామంలో ప్రతి ఇల్లు దీపాలతో ప్రకాశిస్తుంది. ప్రజలు దీన్ని తమ పండుగ, తమ గర్వకారణంగా భావిస్తారు.


