ED investigation Into Illegal Betting Apps: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల అక్రమ దందా ఇప్పుడు ఒక తుఫానులా తెలుగు రాష్ట్రాలను చుట్టుముడుతోంది. యువత భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తున్న ఈ మహమ్మారిపై తెలంగాణ పోలీసులు ఇప్పటికే కఠిన చర్యలు చేపట్టిన వేళ, తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగడం ప్రకంపనలు సృష్టిస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్‌లలో నమోదైన కేసులను ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్‌ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) నమోదు చేయడమే కాకుండా, మంచు లక్ష్మి, రానా దగ్గుబాటి, శ్రీముఖి, నిధి అగర్వాల్, ప్రకాష్‌రాజ్, అనన్య నాగళ్ల సహా మొత్తం 29 మంది సినీ, టీవీ, సోషల్ మీడియా ప్రముఖులపై కేసు నమోదు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ బెట్టింగ్ యాప్‌ల బండారం ఏమిటి? వీటి ప్రమోషన్‌లో సెలబ్రిటీల పాత్ర ఎంత? ఈడీ దర్యాప్తుతో వెలుగులోకి వచ్చే నిజాలు ఏంటి?
ఈడీ ఎంట్రీ: దర్యాప్తులో కీలక పరిణామాలు:
నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం కల్పించడం ద్వారా మనీ లాండరింగ్ పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈడీ రంగంలోకి దిగింది. పీఎంఎల్‌ఏ (Prevention of Money Laundering Act) నిబంధనల కింద ఈ ప్రముఖులపై కేసు నమోదు చేసింది. గతంలో తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగానే ఈడీ తన దర్యాప్తును ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు ప్రముఖుల స్టేట్‌మెంట్‌లను రికార్డు చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది.
యువత వ్యసనం: కోట్ల రూపాయల కుంభకోణం:
బెట్టింగ్ యాప్ నిర్వాహకులు, యువతను ఆకర్షించేందుకు యూట్యూబర్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ నటులను ప్రమోషన్ల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ ప్రమోషన్ల కోసం వారికి లక్షల్లో, కొన్నిసార్లు కోట్లల్లో చెల్లిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే, ఈ భారీ మొత్తాలకు సంబంధించిన లెక్కలను వారు తమ ఐటీ రిటర్న్‌లలో చూపించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ మనీ లాండరింగ్ కోణంలోనే ఈడీ కేసు నమోదు చేసింది. సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ఖాతాలలో లక్షల మంది ఫాలోవర్లను కలిగి ఉండటంతో, వారి ప్రమోషన్ల ద్వారా బెట్టింగ్ యాప్‌లు వేగంగా జనాల్లోకి చొచ్చుకుపోతున్నాయి.
దుష్పరిణామాలు: కుటుంబాల నాశనం, ఆత్మహత్యలు:
‘ఈజీ మనీ’ ఆశతో అనేకమంది బెట్టింగ్‌కు బానిసలవుతున్నారు. ఒకప్పుడు ఉన్నత ఉద్యోగుల నుంచి రోజుకూలీల వరకు, గృహిణుల నుంచి విద్యార్థుల వరకు చాలామంది ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసలవుతున్నారు. లక్షల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయి, బయటపడే మార్గం కనిపించక, సొంతవారికి ముఖం చూపించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో రోజుకో చోట వినిపిస్తున్నాయి. ఈ దారుణాలు అందరినీ కలచివేస్తున్నాయి. ళ బెట్టింగ్ యాప్‌ల దారుణాలపై ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. బెట్టింగ్ యాప్‌లతో పాటు వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించింది.
కఠిన చర్యల దిశగా..
ఇప్పుడు ఈ వ్యవహారంలోకి ఈడీ ప్రవేశించడంతో బెట్టింగ్ ప్రమోటర్లకు చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదు కావడంతో దర్యాప్తు మరింత లోతుగా, కఠినంగా సాగే అవకాశం ఉంది. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చి, బాధ్యులందరికీ శిక్ష పడుతుందని ఆశిద్దాం. ఈ పరిణామాలు ఆన్‌లైన్ బెట్టింగ్ భూతానికి అడ్డుకట్ట వేయడంలో ఎంతవరకు సఫలం అవుతాయి? వేచి చూడాలి


