Viral HR post on employee resignation : ఉదయం 10 గంటలకు బ్యాంకు ఖాతాలో జీతం జమ అయిన చప్పుడు… సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత, 10:05 గంటలకు యాజమాన్యం మెయిల్‌లో రాజీనామా లేఖ ప్రత్యక్షం..! ఒక కొత్త ఉద్యోగి సంస్థలో చేరి, మొదటి జీతం అందుకున్న కొద్ది క్షణాలకే ఉద్యోగానికి వీడ్కోలు పలకడం ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. భారతదేశానికి చెందిన ఒక హెచ్‌ఆర్ ప్రొఫెషనల్ ఈ సంఘటనను లింక్డ్‌ఇన్‌లో పంచుకోవడంతో, వృత్తిపరమైన నైతికతపై దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఇది ఉద్యోగి హక్కా..? లేక సంస్థ నమ్మకాన్ని వమ్ము చేయడమా..? అసలు ఈ ఐదు నిమిషాల వ్యవహారంలో నైతికత ఎవరి పక్షాన నిలుస్తుంది..? ఈ సంఘటన వెనుక ఉన్న పూర్తి కథేమిటి?
హెచ్‌ఆర్ ఆవేదన – నమ్మకంపై దెబ్బ: ఈ చర్చకు మూలకారణమైన హెచ్‌ఆర్ ప్రొఫెషనల్ తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “ఉదయం 10:00 గంటలకు జీతం జమ అయింది, 10:05 గంటలకు రాజీనామా ఈమెయిల్ వచ్చింది” అని ఆమె తన పోస్ట్‌ను ప్రారంభించారు. కొత్త ఉద్యోగికి శిక్షణ ఇచ్చి, అన్ని విషయాల్లో మార్గనిర్దేశం చేసిన తమ బృందాల శ్రమ బూడిదలో పోసిన పన్నీరైందని ఆమె వాపోయారు. “వృత్తిపరమైన నైతికత గురించి మాట్లాడుకుందాం. సంస్థ మిమ్మల్ని స్వాగతించింది, విశ్వసించింది, మీకు ఎదగడానికి ఒక వేదికను ఇచ్చింది. అలాంటిది, మొదటి జీతం ఖాతాలో పడిన ఐదు నిమిషాలకే మీరు వెళ్ళిపోయారు. ఇది సరైనదేనా..? ఇది నైతికమేనా..?” అని ఆమె ప్రశ్నించారు. చివరి నిమిషంలో చేసే రాజీనామాలు ఉద్యోగి ఉద్దేశం, పరిపక్వత జవాబుదారీతనం లేకపోవడాన్ని స్పష్టంగా చూపుతాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఏవైనా సమస్యలుంటే, వాటిని చర్చించి, పరిష్కరించుకోవాలి కానీ, ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోవడం సరికాదని హితవు పలికారు.
నెటిజన్ల ప్రతిస్పందన – ఇది ఉద్యోగి హక్కు : అయితే, హెచ్‌ఆర్ పోస్ట్‌పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వెల్లువెత్తాయి. చాలామంది ఉద్యోగి చర్యను సమర్థిస్తూ, హెచ్‌ఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఒక వినియోగదారుడు ఘాటుగా స్పందిస్తూ, “ఉద్యోగి చేసింది తప్పు కాదు. కానీ ఒక హెచ్‌ఆర్‌గా మీరు ఇలాంటి సున్నితమైన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మీ అపరిపక్వతను చూపిస్తుంది” అని వ్యాఖ్యానించారు.
ఉద్యోగికి మద్దతుగా నిలుస్తూ మరొకరు, “నైతికతా? స్పష్టంగా చెబుతున్నా.. జీతం అనేది గతంలో చేసిన పనికి ప్రతిఫలం, అడ్వాన్స్ కాదు. జీతం తీసుకుని రాజీనామా చేశారంటే, వారు ఆ నెల వరకు తమ బాధ్యతను నెరవేర్చినట్లే. పైగా, ఇంకా నోటీస్ పీరియడ్ కూడా ఉంటుంది కదా! సంస్థకు ఎలాంటి నష్టం జరగదు. కంపెనీలకు జీవితకాల విధేయత కావాలంటే, ఆఫర్ లెటర్లకు బదులుగా పెళ్లి సర్టిఫికెట్లు ఇవ్వాలి” అని వాదించారు. ఈ వాదనను మరో స్థాయికి తీసుకెళ్తూ, “ఇది రెండు వైపులా ఉంటుంది, కానీ త్రాసు సమానంగా లేదు. ఒక ఉద్యోగి ఇలా చేస్తే సంస్థ కూలిపోదు. కానీ, ఒక సంస్థ ఉద్యోగిని అకస్మాత్తుగా తొలగిస్తే, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయి. దయచేసి ఈ కోణంలో కూడా ఆలోచించండి” అని ఒక వినియోగదారు హితవు పలికారు.
నిపుణుల విశ్లేషణ – మారుతున్న కార్పొరేట్ సంస్కృతి : ఈ సంఘటన కేవలం ఒక ఉద్యోగి, ఒక సంస్థకు సంబంధించినది మాత్రమే కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘గ్రేట్ రెసిగ్నేషన్’ అనంతర కాలంలో మారుతున్న ఉద్యోగ సంస్కృతికి, యాజమాన్యాలు-ఉద్యోగుల మధ్య సంబంధాలకు ఇది ఒక నిలువుటద్దంలా నిలుస్తోంది. నేటి యువతరం ఉద్యోగాన్ని కేవలం జీతం కోసం చేసే పనిగా కాకుండా, తమ మానసిక ప్రశాంతతకు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు ప్రాధాన్యతనిస్తున్నారు. సంస్థ సంస్కృతి నచ్చకపోయినా, ఇచ్చిన పాత్రపై అసంతృప్తిగా ఉన్నా, వెంటనే వైదొలగడానికి వెనుకాడటం లేదు. ఈ సంఘటన సంస్థలు తమ నియామక ప్రక్రియలను, ఉద్యోగులతో కమ్యూనికేషన్‌ను, కార్పొరేట్ కల్చర్‌ను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.


