Girl Survives Two Kraits Around Neck: బిహార్‌లోని గయా జిల్లాలో ఊహించని సంఘటన.. పది నిండు సంవత్సరాలు కూడా లేని బాలిక. ఆమె మెడలో రాత్రంతా రెండు అత్యంత విషపూరితమైన కట్లపాములు..! తెల్లారి లేవగానే ఆ దృశ్యం చూసిన తల్లిదండ్రులకు గుండె ఆగిపోయినంత పనైంది. క్షణకాలం పాటు దిగ్భ్రాంతికి లోనైనప్పటికీ, ఆ కన్నతండ్రి తన ప్రాణాలను పక్కనపెట్టి, తన బిడ్డ ప్రాణాలను కాపాడుకున్నాడు. తండ్రి ప్రేమకు, ధైర్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ అద్భుత ఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలు మీకోసం..
ఆ రాత్రి ఏం జరిగిందంటే : గయా జిల్లా, ఫతేపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జామ్హేటా గ్రామంలో రాజు కుమార్ కేసరి తన కుటుంబంతో నిద్రిస్తున్నాడు. తెల్లవారుజామున నిద్రలేచిన రాజు భార్యకు గుండె ఆగినంత పనైంది. తమ పదేళ్ల కుమార్తె సలోని మెడలో అత్యంత భయంకరమైన రెండు కట్లపాములు అల్లుకుని ఉండటాన్ని చూసి భయంతో కేకలు వేసింది. ఆమె అరుపులకు నిద్రలేచిన రాజు ఆ దృశ్యం చూసి ఒక క్షణం నివ్వెరపోయాడు. కదలడానికి కూడా భయపడే అలాంటి పరిస్థితిలో, తన కుమార్తెను కాపాడాలన్న తపన అతడిలో ధైర్యాన్ని నింపింది. క్షణం ఆలస్యం చేయకుండా ప్రాణాలకు తెగించి ముందుకు కదిలాడు.
తన చేతులతో ఆ పాములను పట్టుకుని : పది సంవత్సరాల చిన్నారి మెడపై ప్రాణాంతకమైన కట్లపాములు వేలాడుతున్నా, రాజు కుమార్ కేసరి తన ప్రాణాలను అస్సలు లెక్కచేయలేదు. తన చేతులతో ఆ పాములను పట్టుకుని క్షణాల్లో వాటిని మట్టుబెట్టాడు. కట్లపాము కాటుకు గురైతే మరణం సంభవిస్తుందని తెలిసినా, తన కుమార్తె ప్రాణాలను రక్షించుకోవడానికి రెండు సర్పాలను అక్కడికక్కడే చంపేశాడు. నమ్మశక్యం కాని విషయం ఏమిటంటే, రాత్రంతా ఆ పాములు బాలిక మెడలో ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తూ పాముకాటుకు గురికాకుండా సలోని క్షేమంగా బయటపడింది.
తక్షణ వైద్య సహాయం : పాములను చంపిన వెంటనే, రాజు కుమార్ కేసరి తన కుమార్తె సలోనిని పరుగున ఫతేపుర్ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు బాలికను క్షుణ్ణంగా పరీక్షించి, ఎటువంటి విషపు ప్రభావం లేదని, పాము కాటు జాడలు కూడా లేవని నిర్ధారించారు. అయినప్పటికీ, ముందు జాగ్రత్తగా గయాలోని మగధ్ మెడికల్ కాలేజీకి పంపించారు. ఇక్కడ మరో విస్మయం కలిగించే విషయం ఏమిటంటే, పాములను పట్టుకుని చంపిన రాజుకు కూడా ఎటువంటి విషపు ప్రభావం పడలేదు. అతడు కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కట్లపాము: కట్లపాము (కామన్ క్రైట్) ఆసియా ఖండంలోనే అత్యంత విషపూరితమైన సర్పాలలో ఒకటి. భారతదేశంలో కనిపించే నాలుగు ప్రమాదకరమైన పాములలో ఇదీ ఒకటి. దీని విషం కింగ్ కోబ్రా విషం కంటే కూడా శక్తివంతమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది కాటు వేసినప్పుడు వెంటనే నొప్పి ఉండదు. విషం శరీరంలో వ్యాపించిన తర్వాతే లక్షణాలు కనిపించి ప్రాణాపాయం ఏర్పడుతుంది. అలాంటి రెండు పాముల బారి నుండి బాలిక సురక్షితంగా బయటపడటం నిజంగా దైవానుగ్రహమే అని గ్రామస్థులు భావిస్తున్నారు.
నాన్న ప్రేమకు నిదర్శనం : రాజు కుమార్ కేసరి చూపిన ధైర్యం, తన కుమార్తె పట్ల అతడికున్న అపారమైన ప్రేమ ఎంతోమంది తల్లిదండ్రులకు గొప్ప ప్రేరణగా ప్రజలు భావిస్తున్నారు . ఈ ఘటన జామ్హేటా గ్రామంలో భయాన్ని రేకెత్తించినప్పటికీ, ఆ తండ్రి చూపిన తెగువకు అందరు మెచ్చుకుంటున్నారు. పాము దాడులు సర్వసాధారణమైన గ్రామీణ ప్రాంతాల్లో, ఇలాంటి ఘటనలు ప్రజల్లో పాముల పట్ల అవగాహన పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. అధికారులు ఈ విషయమై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.