Female Passenger Halchal in RTC Bus: ఫుట్‌బోర్డుపై నిలబడొద్దని చెప్పినందుకు బస్సులో అందరినీ హడలెత్తించింది ఓ మహిళ. ఇష్టారీతిగా ప్రవర్తిస్తూ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై మాటల దాడికి పాల్పడింది. తన ఫొటో చూపిస్తే పోలీసులకే దడ పడుతుందంటూ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో ఆర్టీసీ బస్సులో జరిగిన ఈ సంఘటన నెట్టింట్లో వైరల్ అవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చాక వింత వింత సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సీట్ల కోసం కొట్టుకోవడం, ఎక్కడ పడితే అక్కడ బస్సు ఆపమనడం, బస్సుకు అడ్డంగా కూర్చుని రచ్చ చేయడం.. ఇలా తరచూ ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట డిపోకు చెందిన ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు.. విజయవాడ నుంచి పెనుగంచిప్రోలు బయలుదేరింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/fake-babas-exploit-superstitions-sexual-abuse-fraud/
పరిటాల గ్రామానికి చెందిన ఓ మహిళ బస్సు ఎక్కి ఫుట్‌బోర్డుపై నిలబడింది. అది గమనించిన ఆ బస్సు డ్రైవర్.. ఆమెను మెట్ల మీది నుంచి పైకి రావాలని కోరారు. ఫుట్‌బోర్డు ప్రయాణం ప్రమాదకరమని చెప్పారు. అయితే ఆమె డ్రైవర్ మాట వినకుండా అక్కడే నించుంది. దీంతో డ్రైవర్ పైకి రమ్మని గట్టిగా చెప్పాడు. ఈ క్రమంలో ఆగ్రహించిన ఆమె.. డ్రైవర్, కండక్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలోనే గొడవ కాస్త పెద్దదిగా మారింది. వారిపై బెదిరింపులకు పాల్పడింది. తన ఫొటో తీసుకుని ఆ ఫొటోను విజయవాడ సిటీ, చిల్లకల్లు, కంచికచర్ల పోలీస్ స్టేషన్‌లకు తీసుకెళ్లి చూపించాలని.. నా ఫొటో చూపిస్తే పోలీసులకే దడ పుడుతుందంటూ వారితో వాగ్వాదానికి దిగింది. మహిళ ప్రవర్తనతో విసుగుచెందిన తోటి ప్రయాణికులు ఆమెకు సర్ది చెప్పేందుకు విఫలయత్నం చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/warangal-car-mortgage-frauds-emi-default/
దీంతో విసుగెత్తిన డ్రైవర్.. పరిటాల వద్ద బస్సు ఆపకుండా నేరుగా కంచికచర్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ మహిళ ప్రవర్తించిన తీరుపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, గతంలోనూ సదరు మహిళ ఇంటి వద్ద ఇలాగే హడావుడి చేస్తుండటంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


