Fungus Found in Sanitary Pads: ప్రతి మహిళ జీవితంలో నెలలో వచ్చే ఆ మూడు రోజులు ఎంతో కఠినమైనవి. శారీరకంగా, మానసికంగా వచ్చే మార్పులను తట్టుకుంటూ.. ప్రపంచంతో పోటీ పడుతూ పరిగెత్తాలి. నెలలో 27 రోజులు ఎంత పరిశుభ్రంగా ఉంటారో.. ఆ మూడు రోజులు అంతకు మించిన పరిశుభ్రతను పాటించాల్సి ఉంటుంది. అందుకే గత కొన్నేళ్లుగా మహిళల జీవితాల్లో ‘శానిటరీ ప్యాడ్స్’ అనే విప్లవం వారి జీవనశైలిని సులభతరం చేసింది. క్లాత్‌ల ద్వారా వచ్చే ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి నిత్యం కాపాడుతోంది. మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇప్పుడిప్పుడే చేరువవుతున్నా.. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు వ్యక్తిగత శుభ్రత విషయంలో అండగా ఉంటోంది. అయితే గత కొంతకాలంగా ఈ శానిటరీ ప్యాడ్స్ తయారీ విధానం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: https://teluguprabha.net/viral/ks-latha-kumari-walks-on-fire-at-hasanamba-temple/
పలు రకాల బ్రాండ్లు, ఫ్లేవర్లతో శానిటరీ ప్యాడ్స్ తయారవుతున్నాయి. ఇన్నాళ్లు సవ్యంగానే సాగినా ఇప్పుడు వీటి వల్ల పలు ఆందోళనలు నెలకొన్నాయి. ఈ ప్యాడ్స్ తయారీలో ఉపయోగించే కెమికల్ ఫార్ములా కారణంగా మహిళల్లో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు నివేదికలు చెబుతున్నాయి. సర్వికల్ క్యాన్సర్, గర్భాశయ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, సంతానలేమికి దారితీస్తున్నట్లు పలువురు వైద్యులు పేర్కొంటున్నారు. కాగా, తాజాగా శానిటరీ ప్యాడ్స్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఆందోళన మరింత ఎక్కువైంది.
టిక్ టాక్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు మహిళల్లో ఆందోళన కలిగిస్తోంది. పలువురు ఇన్‌స్టా, X లో సైతం ఈ వీడియోను షేర్ చేశారు. సాధారణంగా ప్యాడ్స్ కొనుగోలు చేసినప్పుడు.. దానిపై ఉండే లైనింగ్, కాటన్ కవర్ అంతా సవ్యంగా కనిపిస్తుంది. ఈ మహిళ కూడా అలాగే అనుకుంది… ఓ వీడియో తన దృష్టికి వచ్చేవరకు. తాను వాడుతున్న ప్రముఖ బ్రాండ్ శానిటరీ ప్యాడ్‌ను చెక్ చేశాక షాక్ అవడం ఆమె వంతైంది.
బయట నీట్.. లోపల ఫంగస్
శానిటరీ ప్యాడ్‌ను మాములు వెలుతురులో చూసినప్పుడు అంతా క్లీన్‌గా, నీట్‌గా ఉంది. అయితే ప్యాడ్‌ను లైటింగ్ దగ్గరికి తీసుకొచ్చాక చూస్తే.. అందులో ఫంగస్ ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో కంగారు పడిన మహిళ.. ఇది నిజమేనంటూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసి తన ఆందోళనను వ్యక్త పరిచింది. ఈ వీడియోను ఇప్పుడు 80 లక్షలకు పైగా వీక్షించడంతో మహిళల్లో భయం నెలకొంది. దీనిపై ఆయా ప్రభుత్వాలు, అధికారులు చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు.
ప్రత్యామ్నాయం లేదా..
అయితే ఈ శానిటరీ ప్యాడ్స్‌తో మహిళల్లో ఆరోగ్యానికి సంబంధించి చాలా కాలంగా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా శానిటరీ కప్స్‌ను అందుబాటులోకి వచ్చాయి. వీటిని వినియోగించిన అనంతరం శుభ్రపరిచి మళ్లీ వాడుకునేలా రూపొందించారు. మహిళలూ.. మీరు ఉపయోగిస్తున్న ప్యాడ్స్ ద్వారా కూడా ఇలాంటి సమస్యలే వస్తున్నాయని మీరు భావిస్తే.. అందుకు ప్రత్యామ్నాయ పద్ధతులు ఎంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం.


