Viral Video: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి విపరీతంగా పెరిగింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలామంది ఏదో ఒక సందర్భంలో వీడియోలు తీయడం అలవాటుగా చేసుకున్నారు. మొదట్లో పెళ్లిళ్లు, పుట్టినరోజులు, వేడుకలలో సరదాగా రీల్స్ చేసి సోషల్ మీడియాలో పంచుకునేవారు. ఆ తరువాత షాపింగ్ మాల్స్, పార్కులు, రైల్వే స్టేషన్లు, మెట్రో ట్రైన్లు, బస్సుల్లో కూడా రీల్స్ తీయడం మొదలుపెట్టారు. కానీ ఈసారి ఈ రీల్స్ పిచ్చి అంతకంతకూ హద్దులు దాటి శ్మశాన వాటిక వరకు చేరింది.
చితి ముందే రీల్..
ఒక యువతి శ్మశానంలో మండుతున్న చితి ముందే రీల్ తీయడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఓ యువతి చీర కట్టుకుని, మేకప్ వేసుకుని, వెనక చితి మంటలు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా కెమెరా ముందు డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేయగానే అది చాలా స్పీడుగా వైరల్ అయ్యింది. వీడియోలో వెనక మంటల్లో కట్టెలు కాలుతుండగా, ఆమె మాత్రం పాటకు తగినట్లుగా డాన్స్ చేస్తూ తెగ ఫోజులు కొట్టింది.
సిగ్గు లేదా..
ఆ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఆమె ప్రవర్తనను విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అంత్యక్రియల సమయంలో కుటుంబసభ్యులు బాధలో ఉంటే, ఆ సందర్భంలో ఇలాంటి వీడియోలు తీయడం మానవత్వానికే మాయని మచ్చని నెటిజన్లు చెబుతున్నారు. కొందరు “సిగ్గు లేదా”, “ఇది సరదా కాదు, దుర్వినియోగం” అంటూ ఆమెను తప్పుపట్టారు.
ఇలాంటి వీడియోలు ట్రెండ్ కావాలని కొందరు విచిత్రమైన పనులు చేస్తున్నారని సోషల్ మీడియా వినియోగదారులు అంటున్నారు. కొందరు రైలు పట్టాల మీద పడుకుని వీడియోలు తీయడం, మరికొందరు ప్రమాదకరమైన ప్రదేశాల్లో స్టంట్లు చేస్తూ ప్రాణాలపైకి తెచ్చుకోవడం సాధారణమైపోయింది.
Kuch bolunga to vivad ho jayega pic.twitter.com/4dHsPaIk7P
— ShoneeKapoor (@ShoneeKapoor) August 7, 2025
వీడియోను “@ShoneeKapoor” అనే X (మునుపటి ట్విట్టర్) ఖాతా నుంచి షేర్ చేయగా, అది లక్షలాది మందికి చేరింది. వీడియో చూసిన తర్వాత అనేక మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొందరు ఆ వీడియోను సరదాగా తీసుకున్నా, చాలా మంది మాత్రం తీవ్రంగా విమర్శించారు. కొందరు నెటిజన్లు ఆ యువతిని వెంటనే పోలీసులకు అప్పగించాలని వ్యాఖ్యానించారు. మరికొందరు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.


