Hijras attack on new house owner: కొత్త ఇల్లు కట్టుకున్నామన్న సంబరం కొద్ది రోజులైనా నిలబడలేదు. ఊహించని పరిణామానికి కుటుంబమంతా షాక్‌కు గురైంది. తామేం తప్పు చేశామంటూ బోరున విలపిస్తున్నారు. హిజ్రాల దాడికి ఇంటి యజమాని ఆస్పత్రి పాలు కావడంతో కుటుంబీకుల ఆవేదన ఇది. అసలేం జరిగిందంటే..
Also Read: https://teluguprabha.net/cinema-news/12a-railway-colony-trailer-talk-allari-naresh-thriller/
మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల్‌లోని శ్రీ బాలాజీ ఎన్‌క్లేవ్‌లో సదానందం ఇటీవల ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నారు. బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా గృహ ప్రవేశం చేశారు. ఈ క్రమంలో సదానందం ఆదివారం(నవంబర్ 9న) ఇంటిముందు మిగిలిపోయిన పనులు చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఇద్దరు హిజ్రాలు ఇంటి వద్దకు వచ్చారు.
కొత్త ఇల్లు కట్టావు కదా.. డబ్బులు ఇవ్వమని అడిగారు. సరే.. ఇంటికి వచ్చిన హిజ్రాలను ఉత్తి చేతులతో వెనక్కు పంపడం సరికాదని తోచినంత ఇద్దామనున్నారు. డబ్బు ఇవ్వబోతుంటే ఇది సరిపోదు రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేసుకున్నారు. అందుకు సదానందం నిరాకరించాడు. దీంతో అతడిపై దుర్భాషలాడి అక్కడి నుంచి వెళ్లారు.
కాసేపటికి మూడు ఆటోల్లో దాదాపు 15 మంది హిజ్రాలు గుంపుగా తిరిగి సదానందం ఇంటికి చేరుకున్నారు. ఇంటి గేటును ధ్వంసం చేయడానికి ప్రయత్నించగా.. శబ్దాలు విన్న సదానందం, కుటుంబ సభ్యులు వెంటనే బయటకు వచ్చి ఆపేందుకు యత్నించారు. ఈ క్రమంలో వారిపై కర్రలు, రాళ్లతో హిజ్రాలు దాడికి పాల్పడ్డారు. దాడిలో ఇంటి యజమానికి తీవ్ర గాయాలయ్యాయి.
గొడవను గమనించిన ఇరుగుపొరుగు అక్కడికి రావడంతో హిజ్రాలు భయపడి అక్కడినుంచి పారిపోయారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స తీసుకున్న అనంతరం ఇంటి యజమాని సదానందం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హిజ్రాల ఆగడాలు మితిమీరుతున్నాయంటూ.. వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


