Himachal Pradesh floods viral videos: దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వర్షాలకు పలు చోట్ల కొండ చరియలు విరిగి పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారులు సహా 300 కి పైగా రోడ్లు క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ఇళ్లతోపాటు మార్కెట్లు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో హిమచల్ నుంచి ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోలో వరద ఉధృతికి ఇళ్లు కొట్టుకుపోవడం చూడవచ్చు. అంతేకాకుండా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ భయానక వీడియోలో వీధుల్లోకి వరద నీరు ముంచెత్తడంతో కొన్ని ఇళ్లు పాక్షికంగా మునిగిపోగా.. మరికొన్ని కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త నెటిజన్స్ ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 50వేల మందికి పైగా వీక్షించగా.. వందలాది మంది కామెంట్స్ చేస్తున్నారు. పాపపు పనులు చేయడం వల్ల ఈ వినాశనం సంభించదని.. ఇప్పటికైనా డబ్బు కోసం తప్పుడు పనులు చేయడం మానుకోండి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అక్రమ నిర్మాణాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మరోక యూజర్ రాసుకొచ్చాడు.
గత కొన్ని రోజులుగా హిమచల్ రాష్ట్రాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలోని నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల క్లౌడ్ బరస్ట్ సంభవిస్తున్నాయి. కొండ చరియలు విరిగిపడతంతో వరద ఉదృతి పెరిగి పలు గ్రామాలను ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆస్తినష్టంతోపాటు ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది. కుండపోత వర్షాల కారణంగా రాష్టవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని..అవసరమైతే తప్ప ప్రయాణాలను చేయెుద్దని హెచ్చరిస్తున్నారు.


