Saturday, November 15, 2025
Homeవైరల్Heartwarming : ప్రేమ ముందు పైసలు బలాదూర్.. గర్భిణి భార్య కోసం రూ.1.2 కోట్ల ఉద్యోగానికి...

Heartwarming : ప్రేమ ముందు పైసలు బలాదూర్.. గర్భిణి భార్య కోసం రూ.1.2 కోట్ల ఉద్యోగానికి ఓ భర్త గుడ్‌బై!

Viral Reddit post husband job : డబ్బు చుట్టూ ప్రపంచం పరిగెడుతున్న ఈ రోజుల్లో, బంధానికి, బాధ్యతకు విలువనిచ్చే వారు ఎంతమంది ఉంటారు..? అందులోనూ ఏకంగా కోట్లలో జీతం వచ్చే కొలువును సైతం కాదనుకుని, కుటుంబమే ముఖ్యమని నిరూపించే వారు అరుదుగా కనిపిస్తారు. కానీ, ఓ భారతీయ భర్త తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. గర్భవతిగా ఉన్న తన భార్యకు తోడుగా ఉండేందుకు, ఆమె బాగోగులు చూసుకునేందుకు, సంవత్సరానికి రూ.1.2 కోట్లు సంపాదించి పెట్టే ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా వదిలేశాడు. అసలు, కోట్ల జీతాన్ని కాదనుకొని మరీ భార్య పక్కన నిలబడాలని ఆ భర్త ఎందుకు నిర్ణయించుకున్నాడు..? ఈ ఆధునిక ప్రేమకథ వెనుక ఉన్న అసలు కథేంటి..?

- Advertisement -

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘రెడ్డిట్’లో ఓ వ్యక్తి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. “గర్భధారణ సమయంలో నా భార్యకు మద్దతుగా నా కోటి రూపాయలకు పైగా జీతం ఉన్న ఉద్యోగాన్ని వదిలేశాను” అనే శీర్షికతో అతను పంచుకున్న అనుభవం లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంది.

ఆ వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం, అతనికి సంవత్సరానికి రూ.1.2 కోట్ల జీతం, ఇంటి నుంచే పనిచేసే (రిమోట్ వర్క్) సౌకర్యం, బెంగళూరులోని జయనగర్ వంటి ఖరీదైన ప్రాంతంలో మంచి ఇల్లు.. ఇలా సకల సౌకర్యాలు ఉన్నాయి. అయినప్పటికీ, గర్భం దాల్చిన తన భార్య ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, మాతృత్వపు ప్రయాణంలో ఆమె పడుతున్న భావోద్వేగ అలజడిని గమనించాడు. ఈ కీలక సమయంలో ఆమెకు మానసికంగా, శారీరకంగా పూర్తి తోడుగా నిలవడమే తన ప్రథమ కర్తవ్యమని భావించాడు.

డబ్బు కంటే బంధమే ముఖ్యం : ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ వ్యక్తి ఒక కాలేజీ డ్రాప్‌అవుట్. అయినా తన నైపుణ్యాలతో స్టార్టప్‌లలో పనిచేస్తూ, కేవలం ఏడేళ్లలోనే రూ.7 కోట్లకు పైగా సంపాదించాడు. మొదట, గర్భం దాల్చిన తన భార్యను ఉద్యోగం మానేసి విశ్రాంతి తీసుకోమని కోరాడు. కానీ, ఆమె తన కాళ్లపై తాను నిలబడాలనే పట్టుదలతో పనిని కొనసాగించడానికే ఇష్టపడింది. దీంతో, భార్య నిర్ణయాన్ని గౌరవించిన అతను, ఆమె జీవితంలో మరింత క్రియాశీలక పాత్ర పోషించడం కోసం తానే ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

తన పోస్ట్‌లో అతను ఇలా రాశాడు: “నా అనుభవం, పరిచయాలతో ఎప్పుడైనా మళ్లీ ఉద్యోగం సంపాదించగలననే నమ్మకం నాకుంది. కానీ జీవితంలో సరైన సమయంలో, సరైన చోట ఉండటమే అత్యంత ముఖ్యం. మీ భాగస్వామికి, మీ పిల్లలకు, మీ తల్లిదండ్రులకు మీరు అవసరమైనప్పుడు వారికి అందుబాటులో ఉండాలి. మిగతావన్నీ ఆ తర్వాతే. ఎక్కువ జీతం సంపాదించడం సులభమే కావొచ్చు, కానీ జీవితంలోని ఇలాంటి అమూల్యమైన క్షణాలను కోల్పోతే మళ్ళీ తిరిగి పొందలేం. అది దేనితోనూ విలువ కట్టలేనిది.”

నెటిజన్ల ప్రశంసల జల్లు : ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే వైరల్ అయింది. నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందించారు. అత్యధికులు అతని నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, “నిజమైన ప్రేమకు నిలువుటద్దం,” “ఆడవారిని గౌరవించే భర్త,” “రిలేషన్‌షిప్ గోల్స్” అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. మరికొందరు మాత్రం, ఇంత పెద్ద మొత్తంలో జీతాన్ని వదులుకునేంత ఆర్థిక భద్రత ఉన్న ఈ జంట అదృష్టవంతులని పేర్కొన్నారు. ఏది ఏమైనా, డబ్బు కంటే బంధాలే గొప్పవని చాటిచెప్పిన ఆ భర్త నిర్ణయం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad