Indian Railways- Food Safety: భారతీయ రైల్వేల్లో ఆహార భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (16601) రైలులో చోటుచేసుకున్న ఒక ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈరోడ్ నుండి జోగ్‌బాని దిశగా ప్రయాణిస్తున్న రైలులో, ఒక ప్రయాణికుడు రైలు క్యాటరింగ్ సిబ్బంది ఫుడ్ సరఫరా కోసం వాడిన డిస్పోజబుల్ కంటెయినర్లను వాష్ బేసిన్ దగ్గర కడుగుతున్న దృశ్యాన్ని తన మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారి, రైల్వేల్లో పరిశుభ్రత ప్రమాణాలపై అనేక సందేహాలు, విమర్శలు తెచ్చింది.
వాడిన డిస్పోజబుల్ కంటెయినర్లు..
వీడియోలో కనిపించిన విధంగా, ఇప్పటికే ప్రయాణికులు వాడిన డిస్పోజబుల్ కంటెయినర్లు మళ్లీ శుభ్రం చేస్తున్నట్టు కనిపించడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. అనేకమంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ చర్యను తీవ్రంగా విమర్శిస్తూ, ప్రయాణికుల ఆరోగ్య భద్రతను నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఘటన రైల్వేల్లో ఆహార పరిశుభ్రత ప్రమాణాలపై అధికారుల నిర్లక్ష్యాన్ని చూపుతోందని నెటిజన్లు పేర్కొన్నారు.
Also Read: https://teluguprabha.net/lifestyle/should-we-store-eggs-in-fridge-or-outside-what-science-says/
ఈ వీడియోపై స్పందించిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తక్షణమే చర్యలు చేపట్టింది. అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేసిన ప్రకటనలో, ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని IRCTC స్పష్టం చేసింది. వీడియోలో కనిపించిన విక్రేతను వెంటనే గుర్తించి, అతన్ని విధుల నుండి తొలగించినట్లు పేర్కొంది. అదేవిధంగా, ఆ క్యాటరింగ్ సర్వీస్‌కు సంబంధించిన లైసెన్స్ కూడా రద్దు చేసినట్లు తెలిపింది.
16601 Erode–Jogbani Vande Bharat catering staff demonstrating how recycling aluminium food-foil helps sustainability, conserves natural resources, and reduces pollution.
They could’ve reused it without washing, but then, apart from environment, they care about your health too. pic.twitter.com/hIETMjjNPo
— THE SKIN DOCTOR (@theskindoctor13) October 19, 2025
IRCTC ప్రకటన ప్రకారం, ఆ విక్రేతకు భారీ జరిమానా కూడా విధించినట్లు తెలుస్తుంది. అయితే విచారణలో ఆసక్తికరమైన విషయం బయటపడిందని IRCTC పేర్కొంది. వీడియోలో కనిపించిన డిస్పోజబుల్ కంటెయినర్లు వాడిన తర్వాత పారవేయడానికి ముందు శుభ్రం చేసినవని, వాటిని తిరిగి ఆహారం వడ్డించడానికి ఉపయోగించలేదని సంస్థ స్పష్టం చేసింది. ఈ వివరాలు అధికారిక దర్యాప్తులో తేలినట్లు IRCTC తెలిపింది.
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలు ప్రయాణికులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని సంస్థ స్పష్టం చేస్తూ, నిజాలను నిర్ధారించకుండా ప్రచారం చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. రైల్వేల్లో ఆహార పరిశుభ్రతకు సంబంధించిన ప్రోటోకాల్‌లను కచ్చితంగా అమలు చేస్తున్నామని IRCTC తెలిపింది.
IRCTC వివరణ ప్రకారం, భారతీయ రైల్వేలు ప్రయాణికుల ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడానికి అనేక చర్యలను ఇప్పటికే అమలు చేస్తున్నాయి. అందులో భాగంగా, ప్రతి కిచెన్‌లో కెమెరాలను ఏర్పాటు చేసి భోజన తయారీ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా, ప్రతి క్యాటరింగ్ యూనిట్ FSSAI ధృవీకరణ తప్పనిసరి చేసినట్లు అధికారులు వివరించారు. భోజన నాణ్యతను నిరంతరం పరిశీలించడానికి నియమిత తనిఖీలు నిర్వహిస్తున్నారని IRCTC తెలిపింది.


