Javed Akhtar patriotism controversy : స్వాతంత్ర్య దినోత్సవం వేళ దేశమంతా మువ్వన్నెల జెండాకు వందనం చేస్తున్న తరుణంలో, సోషల్ మీడియాలో ప్రముఖ రచయిత, కవి జావెద్ అక్తర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన దేశభక్తిని కించపరుస్తూ కొందరు నెటిజన్లు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే, ఆ విమర్శలకు ఏమాత్రం తలొగ్గని అక్తర్, తనదైన శైలిలో చారిత్రక సత్యాలతో గట్టి సమాధానమిచ్చారు. మాటల తూటాలతో వారి అజ్ఞానాన్ని ఎండగట్టారు. అసలు స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఏం జరిగింది..? కవి జావెద్ అక్తర్ దేశద్రోహులుగా ఎవరిని ఉద్దేశించారు..? తెలుసుకోవాలంటే ఈ కథనం మీకోసమే..
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జావెద్ అక్తర్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ప్రశాంతంగా ఉన్న వాతావరణంలోకి ఒక నెటిజన్ నిప్పురవ్వ విసిరాడు. “మీ స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 14 కదా?” అంటూ పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉటంకిస్తూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్య జావెద్ అక్తర్‌లోని ఆత్మాభిమానాన్ని, దేశభక్తిని తట్టిలేపింది.
వెంటనే ఆయన తీవ్రంగా స్పందిస్తూ, ఆ నెటిజన్‌కు దిమ్మతిరిగే బదులిచ్చారు. “నాయనా, మీ తాత ముత్తాతలు బ్రిటీష్ వారి బూట్ల కింద బానిసత్వం చేస్తుంటే, నా పూర్వీకులు ఈ దేశ స్వేచ్ఛ కోసం పోరాడి అండమాన్‌లోని కాలాపానీ జైలులో ప్రాణాలర్పించారు. నీ హద్దుల్లో నువ్వుండు” అంటూ చురకలంటించారు. అక్తర్ పూర్వీకులు స్వాతంత్ర్య సమరయోధులన్న చారిత్రక నిజాన్ని ఈ వ్యాఖ్య ద్వారా ఆయన బల్లగుద్ది చెప్పారు.
ఈ సంభాషణ జరుగుతుండగానే, మరో నెటిజన్ కల్పించుకుని, “కానీ మీరు దేశద్రోహి” అంటూ నేరుగా ముద్రవేశాడు. ఈ ఆరోపణతో అక్తర్ మరింత ఘాటుగా, చారిత్రక ఆధారాలతో తన వాదనను వినిపించారు. దేశద్రోహులెవరో నిర్వచిస్తూ ఆయన సంధించిన అక్షరాస్త్రాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
“దేశద్రోహులెవరంటే… సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా వంటి మహోద్యమాలను వ్యతిరేకించిన వారు. ఆనాడు స్వాతంత్ర్య పోరాటాన్ని నీరుగార్చడానికి ఆంగ్లేయులకు అండగా నిలిచిన వారు. మన రాజ్యాంగాన్ని, మనం గౌరవించే ఈ త్రివర్ణ పతాకాన్ని తిరస్కరించిన వారు. వారెవరో ముందు తెలుసుకో. నీ అజ్ఞానాన్ని కాస్త తగ్గించుకో బాబూ!” అని హితవు పలికారు. ఈ వ్యాఖ్యల ద్వారా, స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో బ్రిటీష్ వారికి మద్దతుగా నిలిచిన సంస్థలు, వ్యక్తులనే ఆయన పరోక్షంగా ఉద్దేశించారని స్పష్టమవుతోంది. ఆయన సమాధానాలు కేవలం ఆ ఇద్దరు నెటిజన్లకే కాకుండా, గుడ్డిగా విమర్శలు చేసే వారందరి నోళ్లు మూయించేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.


