Kavala Pillala Baavi in Patha Doddikunta Village: సాధారణంగా కొన్ని ఊళ్లలో కవల పిల్లలు ఉండటం చూస్తుంటాం. కానీ ఒకే ఊరిలోనే వందల కొద్దీ కవల పిల్లలు ఉండటం ఎప్పుడైనా విన్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా.. అవును ఆ గ్రామంలో ఒక జంట కాదు, రెండు జంటలు కాదు.. ఏకంగా 150కి పైగా ట్విన్స్ ఉన్నారు. అందుకు కారణం కూడా ఉంది.. ఈ వార్త తెలిసిన చాలా మంది సంతానం లేని జంటలు ఆ ఊరికి క్యూ కడుతున్నారు. ఇంతకీ ఆ ఊరు పేరేంటి.. అందుకు కారణం ఏంటి.. ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read: https://teluguprabha.net/viral/russia-mi-8-helicopter-crash-dagestan-video/
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెళ్లయిన చాలా మంది జంటలు ఎదుర్కొంటున్న సమస్య సంతానలేమి. ఆహార శైలిలో మార్పులు, హార్మోన్ల అసమతుల్యత, పనివేళల్లో నైట్ షిఫ్టులు, ట్రాఫిక్ పొల్యూషన్, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ సంతానలేమికి దారితీస్తుంటే.. మరోవైపు పిల్లలు లేని వారిపై సమాజంలో చిన్నచూపు, సూటిపోటి మాటలు.. వారి మానసిక ఆరోగ్యంపై మరింత ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ప్రభావంగా ఫెర్టిలిటీ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇదే అదునుగా భావించి దంపతుల నుంచి రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. పిల్లలు కావాలనే ఆశ, తాపత్రయం.. వారిని వెనుకడుగు వేయనీయడం లేదు. ఎంత ఖర్చు అయినా సరే అప్పు చేసి మరీ పిల్లల కోసం తిప్పలు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఏ దేవుడిలో ఏ మహిమ ఉందో, ఏ మంత్రంలో ఏ ఎనర్జీ ఉందో.. ఏ చెట్టులో ఏ మందు ఉందో అని సంతానప్రాప్తి కోసం కొన్ని ఆలయాలకి వెళ్తుండటం చూస్తుంటాం. గరిక పోచ కూడా సంతాన సమస్యలను తీరుస్తుంది అని పెద్దలు చెప్తుంటారు.
ఈ క్రమంలో ఇప్పుడు చాలా మంది ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఓ ఊరి వైపు క్యూ కడుతున్నారు. రాజమండ్రికి 30 కి.మీ దూరంలోని పాతదొడ్డికుంట గ్రామంలో 150 మందికి పైగా కవల పిల్లల జంటలు ఉన్నారట. అందుకు కారణం.. ఆ గ్రామస్థులు ఈ ఊరిలోని ఓ బావిలో నీళ్లు తాగడమే అని చెబుతున్నారు. కవల పిల్లల బావి అని పిలుచుకునే ఆ బావిలో నీరు తాగడం వల్ల ట్విన్స్ పుడుతున్నారని నమ్మకం ఏర్పడింది. దీంతో ఈ వార్త ఆ నోటా ఈ నోటా పాకి చుట్టుపక్కల గ్రామాలతో పాటు చాలా మందికి ఈ విషయం తెలిసింది. ఫలితంగా చాలా మంది సంతానం లేని జంటలు.. ఆ ఊరిలో బావి నీళ్ల కోసం చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వెళ్తున్నారు.
Also Read: https://teluguprabha.net/viral/watch-a-video-of-a-cute-lady-doctor-treating-a-child-is-going-viral/
పాతదొడ్డికుంట గ్రామంలో సంతాన లక్ష్మీ దేవి అమ్మవారి గుడి కూడా ఉంది. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం దంపతులు ఈ ఊరిలోని బావిలో నీళ్లను క్యాన్లలో నింపుకొని తీసుకెళ్తున్నారు. ఈ బావి నీళ్లు తాగడం ద్వారా కవల పిల్లలు పుట్టడం అనేది వాస్తవమేనని గ్రామస్థులు సైతం చెబుతున్నారు. అయితే ఈ నీరు ఒక్కసారి తాగితే సరిపోదని.. కనీసం ఆరు నెలల పాటు మరే నీళ్లు తాగకుండా ఈ నీళ్లు మాత్రమే తాగాలని గ్రామస్థులు సూచిస్తున్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


