Fake Robbery For Mobile Viral Video: ఓ బాలికతో ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లో పరిచయం పెంచుకుని ఆ పై వేధింపులకు పాల్పడిన వ్యక్తికి మైండ్ బ్లాంక్ అయ్యే రీతిలో బుద్ధి చెప్పారు ఆ బాలిక స్నేహితులు. ఫేక్ ఐడీతో పరిచయం పెంచుకుని అతడిని రప్పించి దేహశుద్ధి చేశారు. అనంతరం సెల్‌ఫోన్ లాక్కున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని సేలంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. చెన్నైకి చెందిన బ్రాహ్మణయాగంకి ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లో ఓ బాలిక పరిచయం కాగా.. కొద్దిరోజులకి అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ అకౌంట్ తెరిచాడు. సదరు బాలికను బ్రాహ్మణయాగం ఆన్‌లైన్‌లో వేధించడంతో విసుగుచెంది.. స్నేహితుడైన రామకృష్ణన్‌కు విషయం చెప్పింది. దీంతో బ్రాహ్మణయాగంను అతడు హెచ్చరించినా.. వేధింపులు ఆపకపోవడంతో గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు.
రామకృష్ణన్ తన స్నేహితులతో కలిసి ఓ ప్లాన్ వేశాడు. సోషల్ మీడియాలో ఫేక్ ఐడీతో అకౌంట్ క్రియేట్ చేసి బ్రాహ్మణయాగంతో చాట్ చేశారు. తెలివిగా అతడ్ని సేలం రప్పించి వంతెన వద్ద అడ్డుకున్నారు. దొంగల మాదిరిగా నటించి మొబైల్ ఫోన్ లాక్కుని బైక్‌పై పారిపోయారు. అనంతరం బాలికను వేధించిన చాటింగ్‌లు ఉన్న ఆ మొబైల్ ఫోన్‌ను స్నేహితులు ధ్వంసం చేయడంతో కథ ముగిసిపోయిందనుకున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది.
Also Read: https://teluguprabha.net/viral/mother-brought-band-melam-for-daughters-to-wake-up/
వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై దాడి చేస్తుండగా అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి చేరింది. వెంటనే దర్యాప్తు ప్రారంభించి బ్రాహ్మణయాగం నుంచి మొబైల్ ఫోన్ దోచుకున్న రామకృష్ణన్, అతడి ఇద్దరు స్నేహితులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అయితే అది నిజమైన దోపిడీ కాదని, ప్రతీకారమని పోలీసులు గ్రహించారు.
తమ స్నేహితురాలిని బ్రాహ్మణయాగం సెల్‌ఫోన్‌లో చాటింగ్‌లో వేధించాడని.. అందుకే అతని మొబైల్ ఫోన్ చోరీ కోసం ఈ ప్లాన్ వేసినట్లు యువకులు తెలపడంతో ధ్వంసం చేసిన ఆ మొబైల్ ఫోన్‌లోని స్క్రీన్ షాట్లను పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


