Manapparai Murukku: ఒక్క కరకర లాడే కొరుకుడు.. క్రంచీ శబ్దం.. నాలికపై కరిగిపోయే నెయ్యి, ఇంగువ సువాసనలు! తమిళనాడులోని తిరుచ్చి సమీపంలో ఉన్న చిన్న పట్టణం ‘మనప్పారై’ పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తొచ్చేది అక్కడ చేసే మురుకులు వీటినే జంతికలు లేదా చక్కిలాలు అంటారు. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ మనప్పారై మురుకు ఇప్పుడు ఏకంగా తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం (Trichy International Airport) స్నాక్స్ కౌంటరై క్యాంటీన్‌ను ఏలుతోంది. దేశ విదేశాలకు వెళ్లే ప్రయాణికులు మన దేశ సంప్రదాయ రుచిని జ్ఞాపకంగా వెంట తీసుకెళ్లేలా ఎయిర్‌పోర్ట్‌లో వీటి అమ్మకాలు రోజురోజుకీ ఊపందుకుంటున్నాయి.
మనప్పారై మురుకు ప్రత్యేకత ఏంటో తెలుసా.?
సాధారణంగా చేసే జంతికలకు, మనప్పారై మురుకుకు చాలా తేడా ఉంటుంది. దీన్ని ఒకేసారి నూనెలో పూర్తిగా వేయించరు. మొదట సగం వేయించి బయటకు తీసి, కాసేపటి తర్వాత మళ్లీ వేడి నూనెలో మలిసారి వేగిన తర్వాత అప్పుడు బయటకు తీస్తారు. ఈ పద్ధతి వల్ల మురుకు లోపలి వరకు సమానంగా వేగి, ఎంత తిన్నా నూనె జిడ్డు అనిపించకుండా ఉండటం ప్రత్యేకత. లేత పసుపు, బంగారు వర్ణంలో డజన్ల కొద్దీ మెలికలతో అత్యంత సన్నగా, ఒత్తుగా ఉంటూ.. కొరకగానే ఎంతో గుల్లగా ఉండటమే కాకుండా నోట్లే వేస్తే ఇట్టే కరిగిపోతాయి.
మనప్పారై మురుకుల వెనుక కథ, నీటి రహస్యం
మనప్పారై మురుకు ప్రస్థానం 1914వ సంవత్సరంలో ప్రారంభమైంది. మనప్పారై రైల్వే స్టేషన్ సమీపంలో ‘మణియార్’ అనే వ్యాపారి మొదటిసారిగా ఈ జంతికలను తయారుచేసి రైలు ప్రయాణికులకు విక్రయించడం మొదలుపెట్టారు. రైలు ప్రయాణికుల ద్వారా ఈ రుచి ఊరూరా వ్యాపించింది. అంతేకాకుండా ఈ మురుకు ప్రత్యేక రుచికి కారణం అక్కడ ఉండే భూగర్భ జలాలు కావడం విశేషం. మనప్పారై ప్రాంతపు నీటిలో ఉండే సహజసిద్ధమైన ఉప్పుదనం, ఖనిజ లవణాల వల్ల పిండికి ఒక రకమైన ప్రత్యేకమైన రుచి, క్రంచీనెస్ తోడయ్యాయి. వేరే ఏ ఊరి నీటితో చేసినా ఈ అసలైన రుచి రాదని స్థానిక తయారీదారులు చెబుతుండటం విశేషం..
మనప్పారై మురుకులో ఎటువంటి రసాయనాలు లేదా కృత్రిమ రంగులు వాడకుండా సహజసిద్ధంగా తయారు చేస్తారు. పచ్చి బియ్యపు పిండి, మినపప్పు పిండి, వెన్న లేదా స్వచ్ఛమైన నెయ్యి, వాము, నువ్వులు, ఇంగువ తగినంత ఉప్పు సరైన నిష్పత్తిలో కలిపి చేతి వడికతోనే మురుకును చుట్టి, స్వచ్ఛమైన రిఫైన్డ్ నూనె లేదా వేరుశనగ నూనెలో వేయిస్తారు. అందుకే సాధారణ జంతికలతో పోలిస్తే వీటి రుచి చాలా ప్రత్యేకం.
భౌగోళిక గుర్తింపు
మనప్పారై మురుకుకు ఉన్న విశిష్టత, చారిత్రక ప్రాధాన్యతను గుర్తించిన భారత ప్రభుత్వం దీనికి భౌగోళిక గుర్తింపు (Geographical Indication – GI Tag)ను మంజూరు చేయడం విశేషం. ఈ గుర్తింపుతో మనప్పారై పరిసర ప్రాంతాల తయారీదారులు మాత్రమే ఈ పేరుతో అసలైన మురుకులను విక్రయించే హక్కు దక్కించుకున్నారు.
ఎయిర్‌పోర్ట్‌లో పర్యాటకుల మనసు దోచిన మనప్పారై మురుకు
సింగపూర్, మలేషియా, దుబాయ్ వంటి దేశాలకు వెళ్లే ప్రయాణికులు తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌లోని ప్రత్యేక హ్యాండ్ లూమ్ & లోకల్ ప్రొడక్ట్స్ కౌంటర్‌లలో ఈ మురుకు ప్యాకెట్లను ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు రైలు ప్రయాణికుల ఆకలి తీర్చిన మనప్పారై మురుకు, నేడు విమానాల్లో ప్రపంచ యాత్ర చేస్తూ తమిళనాడు సాంప్రదాయ వంటకాల ఖ్యాతిని ఖండాంతరాలకు చాటుతోంది!

