Massive cloudburst in Uttarkashi: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశిలోని హర్సిల్ సమీపంలోని ధరాలి ప్రాంతంలో భారీ క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో వరద ప్రవాహానికి వందలాది ఇళ్లు కొట్టుకుపోయాయి. 50 మందికిపైగా గల్లంతయ్యారు. నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. హర్సిల్ ప్రాంతంలోని ఖీర్ గఢ్ నీటి మట్టం ఒక్కసారిగా పెరగడం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఉత్తరకాశి క్లౌడ్ బర్స్ట్ సంబంధించిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ధరాలిలో క్లౌడ్ బరస్ట్ పై హోంమంత్రి అమిత్ షా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో మాట్లాడినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సోమవారం హల్ద్వానీ సమీపంలోని భఖ్రా వాగు పొంగడంతో ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు. ఆదివారం భుజియఘాట్ సమీపంలో మరో ఇద్దరు నీట మునిగారు. రుద్రప్రయాగలో రాత్రిపూట కొండచరియలు విరిగిపడిన కారణంగా రెండు దుకాణాలు ధ్వంసమయ్యాయి.
సీఎం ఆదేశాలు
రాష్ట్రంలో నిరంతర వర్షం కారణంగా సోమవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా రోడ్లు కొట్టుకుపోతే.. వాటిని తిరిగి ప్రారంభించడానికి వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ధామి అధికారులను ఆదేశించారు. తాగునీరు మరియు విద్యుత్ లైన్లకు నష్టం జరిగితే, త్వరగా పని చేయించడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు.
నీటి ఎద్దడి సమస్యలను పరిష్కరించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.


