Mother brings Band Mela for Daughters: స్మార్ట్‌ఫోన్ చేతికొచ్చాక, ఇంటర్నెట్ అత్యంత చవకగా అందరికీ అందుబాటులోకి వచ్చాక.. ఎవరికీ టైం తెలియడం లేదు. కొందరు ఎప్పుడు తింటున్నారో, ఎప్పుడు నిద్ర పోతున్నారో.. తెలియకుండా ఎక్కువ సమయం సోషల్ మీడియాలో తల దూర్చేస్తున్నారు. ఏ అర్ధరాత్రి దాటాకో కునుకు తీసి, తెల్లారి పొద్దుపోయాక కానీ నిద్ర లేవడం లేదు. చిన్నపిల్లలైనా రెండు సార్లు అమ్మ గట్టిగా కేకలు వేయగానే గబుక్కున మంచం దిగి.. రెడీ అయి నీట్‌గా స్కూల్‌కి వెళ్తున్నారు. కానీ ఓ వయసొచ్చాక మాత్రం చిన్నతనం కంటే ఎక్కువ మొండితనం ప్రదర్శిస్తున్నారు. అలాంటి తమ కూతుళ్లకు ఓ తల్లి సరైన గుణపాఠం చెప్పింది. హాస్యంగా చెప్పినా ఇందులో చాలా అర్థం ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Also Read: https://teluguprabha.net/national-news/kerala-police-bike-stunt-president-murmu-route/
ఉదయాన్నే ఎంత పిలిచినా నిద్ర లేవని తమ కూతుళ్లకు ఓ తల్లి మరిచిపోలేని ట్రీట్‌మెంట్ ఇచ్చింది. ఈ వీడియో ఇప్పుడు నవ్వులు పూయిస్తుండటంతో పాటు నెటిజన్లు నుంచి కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ తెగ వైరల్ అవుతోంది. మీమ్స్ క్రియేట్ చేసి ఫన్ పుట్టిస్తున్నారు.
రోజూ ఎంత బతిమాలినా పిల్లలు నిద్రలేవడం లేదని ఓ ఉపాయం చేసింది తల్లి. పొద్దున్నే మళ్లీ ఓ సారి ప్రయత్నించింది. అయినప్పటికీ మంచం దిగకపోవడంతో ఏకంగా బ్యాండ్ మేళం వాళ్లని ఇంటికి పిలిపించింది. ఇద్దరు సంగీతకారులు గదిలోకి వచ్చి డోలు, ట్రంపెట్‌తో భక్తి గీతం వాయించారు. దీంతో ఉలిక్కిపడి లేచిన కూతుళ్లు.. దుప్పటి తీసి నవ్వుకుని మళ్లీ ముసుగుతన్నారు. అయినా బ్యాండ్ అలాగే వాయించడంతో దుప్పట్లోనే ముసి ముసి నవ్వులు నవ్వుకుని చివరకు మంచం దిగారు.
Also Read: https://teluguprabha.net/viral/Ziva-says-she-wants-to-become-a-naturalist/
ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మిలియన్ల వ్యూస్ సంపాదించుకున్నారు. మీ పిల్లలు బ్యాండ్‌తో అయినా లేస్తున్నారు. మా పిల్లలకైతే డీజే పెట్టాలంటూ ఫన్నీ కామెంట్ చేశారు. మదర్ రాక్స్.. డాటర్స్ షాక్ అంటూ వ్యాఖ్యానించారు. మదర్ ఆఫ్ ది ఇయర్ అంటూ మరికొందరు స్పందించారు. ఎంతైనా ఈ కాలం పిల్లలకు ఇలాంటి తల్లులు అవసరం కదా.. ఈ ఫన్నీ వీడియో చూసి మీరూ నవ్వుకోండి.


