Modi RAX phone: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి ప్రజల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ఆయన జీవనశైలి, రోజువారీ అలవాట్లు, ఉపయోగించే వస్తువులు అన్నీ అందరికీ చర్చనీయాంశాలవుతాయి. ఈరోజు, సెప్టెంబర్ 17న, ప్రధాని మోదీ 75వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఆయన అధికారిక పనుల్లో ఉపయోగించే కమ్యూనికేషన్ ఫోన్‌పై అందరి దృష్టి పడింది. సాధారణంగా ఎవరు ఏ ఫోన్ వాడుతున్నారు అన్నది పెద్ద వార్త కాదేమో కానీ దేశ ప్రధానమంత్రి ఉపయోగించే పరికరం మాత్రం ప్రత్యేకత కలిగిఉంటుంది.
RAX ఫోన్…
ప్రధానమంత్రి తన అధికారిక పనుల్లో ఉపయోగించే ఫోన్ సాధారణ స్మార్ట్‌ఫోన్ కాదు. ఆయన దగ్గర ఉండే పరికరం పేరు RAX ఫోన్. ఇది అత్యంత భద్రతా లక్షణాలతో రూపొందించబడిన ప్రత్యేక పరికరం. కాల్స్ ద్వారా పంచుకునే సమాచారంలో అత్యంత సున్నితమైన విషయాలు ఉండటంతో, ప్రధానమంత్రి, ఉన్నతస్థాయి ప్రభుత్వాధికారులకు పూర్తి భద్రత కలిగిన కమ్యూనికేషన్ తప్పనిసరి. ఈ కారణంగా మోదీ RAX ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు.
Also Read:https://teluguprabha.net/devotional-news/navratri-2025-vastu-tips-for-home-prosperity/
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్..
ఈ ఫోన్‌ను సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DoT) అభివృద్ధి చేసింది. దీని ప్రధాన లక్ష్యం భద్రతను గరిష్ట స్థాయిలో కల్పించడం. RAX పరికరంలో మూడంతస్తుల ఎన్‌క్రిప్షన్ ఉంటుంది. అంటే కాల్ ద్వారా సమాచారాన్ని ఎవరూ మధ్యలో చొరబడలేరు. ఈ రక్షణ కారణంగా హ్యాకింగ్ లేదా ట్రాకింగ్ దాదాపు అసాధ్యం. ఇది మిలిటరీ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లపై పనిచేస్తుంది కాబట్టి, సాధారణ నెట్‌వర్క్‌లతో పోలిస్తే చాలా సురక్షితంగా ఉంటుంది.
వేలిముద్ర గుర్తింపు..
RAX ఫోన్‌లో వినియోగదారుని ధృవీకరించడానికి వేలిముద్ర గుర్తింపు విధానం అమలు చేశారు. పరికరాన్ని ఆపరేట్ చేయడానికి అధికారం ఉన్న వ్యక్తి మాత్రమే ఉపయోగించగలడు. ఈ విధానం వల్ల భద్రత మరింత పెరుగుతుంది. అదేవిధంగా కాల్ చేసేటప్పుడు లైవ్ పిక్చర్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే కాల్ చేసే వ్యక్తి నిజంగా ఆయనేనని నిర్ధారించుకునే అవకాశం లభిస్తుంది. ఈ సాంకేతికత వల్ల మోసపూరిత కాల్స్ జరగకుండా కాపాడుతుంది.
మరో ముఖ్యమైన అంశం హ్యాండ్‌సెట్ స్థాయిలోనే కమ్యూనికేషన్ ఎన్క్రిప్ట్ అవ్వడం. ఈ విధానం వల్ల మధ్యలో ట్యాపింగ్ జరగడం లేదా ఎవరో కాల్‌ని హ్యాక్ చేయడం చాలా కష్టమవుతుంది. సమాచారాన్ని రక్షించడంలో ఇది అత్యంత కీలకమైన అంశంగా భావిస్తారు.
ప్రభుత్వం తరఫున ఈ ఫోన్‌ల భద్రతను NTRO, DEITY వంటి ఏజెన్సీలు పర్యవేక్షిస్తున్నాయి. దేశ భద్రతకు సంబంధించిన వివరాలు ఈ ఫోన్‌ల ద్వారా పంచే అవకాశం ఉండటంతో, ఈ పరికరంపై ప్రత్యేకంగా నిఘా వహిస్తున్నారు.
ప్రస్తుతం RAX ఫోన్‌ల ధరను బహిరంగంగా ప్రకటించలేదు. ఎందుకంటే ఈ పరికరాలు సాధారణ మార్కెట్‌లో లభించవు. ప్రభుత్వానికి మాత్రమే సరఫరా అవుతాయి. ఈ కారణంగా ధర వివరాలు పంచుకోవడం కూడా పరిమితంగానే ఉంచారు.
దేశ భద్రతా అవసరాలకోసం..
మోదీ ఉపయోగిస్తున్న ఈ ఫోన్ కేవలం ఒక పరికరం మాత్రమే కాకుండా, దేశ భద్రతా అవసరాలకోసం రూపొందించిన కీలక సాధనంగా పరిగణించడం జరుగుతోంది. దేశంలోనే అభివృద్ధి చేసిన ఈ సాంకేతికతపై ఆధారపడి ప్రధాని మోదీ తన అధికారిక సంభాషణలను కొనసాగిస్తున్నారు.
భారతదేశం వంటి భారీ జనాభా గల దేశంలో ప్రధానమంత్రి ఫోన్ భద్రత చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక చిన్న లోపం దేశ భద్రతను ప్రమాదంలో పడేస్తుంది. అందువల్లే సాధారణ ఫోన్‌ల కంటే వంద రెట్లు రక్షణ కలిగిన RAX పరికరం వాడకం తప్పనిసరి అయింది.


