Noodles with Maggi Capsule: మ్యాగీ, ఇప్పీ లాంటి ఇన్‌స్టాంట్ నూడుల్స్‌కి మార్కెట్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కేవలం 2 నిమిషాల్లో నూడుల్స్ రెడీ అని వాణిజ్య ప్రకటనల్లో చెబుతున్నా.. రియల్ టైంలో దాదాపు 10 నిమిషాలు అయినా సమయం పడుతుంది. ఈ క్రమంలో కేవలం 30 సెకన్లలోనే మ్యాగీ క్యాప్సూల్‌తో రుచికరమైన నూడుల్స్ రెడీ అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
కేవలం 30 సెకన్లలోనే క్యాప్సూల్‌తో టేస్టీ మ్యాగీ నూడుల్స్ తయారు చేశాడు ఓ ఇన్‌ఫ్లుయెన్సర్. ఓ గిన్నెలో నీళ్లను మరగబెట్టి అందులో పసుపు కలర్ ట్యాబ్లెట్ వేశాడు. సెకన్లలోనే ఆ క్యాప్సూల్ కరిగి అచ్చం మ్యాగీలా పొడవాటి నూడుల్స్ వాటితో పాటు మసాలా సైతం విడుదలైంది. ఆ తర్వాత కాసేపటికి ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ నూడుల్స్ తినడాన్ని వీడియోలో చూపించాడు. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
అయితే ఈ వీడియో నిజం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం అసాధ్యంగానే మారిందని చెప్పొచ్చు. అంతలా మనల్ని భ్రమంలో పడేస్తుంది. ఈ వీడియో కూడా అంతే. దీనిపై మ్యాగీ ఇండియా సైతం అధికారికంగా స్పందించింది. కేవలం ఏప్రిల్ 1 రోజే అందరినీ ఫూల్ చేయాలని.. అన్ని రోజులనూ ఫూల్స్ డేగా సెలబ్రేట్ చేయొద్దని సెటైర్లు విసిరింది. క్యాప్సూల్‌తో మ్యాగీ వీడియో ‘ఏఐ ఫేక్’ వీడియో అని మ్యాగీ ఇండియా పేర్కొంది.
ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్‌ను సంపాదించుకుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. క్యాప్సూల్‌తో మ్యాగీ చేయడం ఒకవేళ నిజమే అయినా ‘నేను ఇలా ట్యాబ్లెట్స్‌ను నీళ్లలో మరిగించి ప్రిపేర్ చేసుకోను’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. వీడియో చివర ఫోర్క్ వంగి ఉందని.. ఇది ఏఐ వీడియో అని స్పష్టంగా తెలుస్తోందని మరో నెటిజన్ పేర్కొన్నారు. అయితే వైరల్ వీడియోలలో చూపించినవి కేవలం వినోదం కోసం చేసినవి, ఇలాంటి క్యాప్సూల్‌లను నిజ జీవితంలో ఆహారంలో ఉపయోగించకూడదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

