Phone Pe Transaction Fail ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం నడుస్తోంది. చిన్న చిన్న పేమెంట్స్ నుంచి పెద్ద పెద్ద లావాదేవీల వరకు అంతా ఆన్‌లైన్‌లోనే నడుస్తోంది. చేతిలో రూపాయి లేకపోయినా.. స్మార్ట్‌ఫోన్, అందులో ఫోన్ పే లేదా గూగుల్ పేలో డబ్బులు ఉంటే సరిపోతుంది. ఏది కొనాలన్నా చిల్లర లేదనే టెన్షన్ లేకుండా అన్నీ ఫోన్ ద్వారా చెల్లిస్తున్నారు. ఇప్పుడు అదే ఓ యువకుడికి పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. విలువైన వాచ్ పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది.
ఫోన్ పే పనిచేయడం లేదని చెప్పినా వినిపించుకోకుండా కస్టమర్‌పై చిరు వ్యాపారి దురుసుగా ప్రవర్తించిన ఘటన చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: https://teluguprabha.net/viral/car-catching-fire-while-celebrating-crackers-festival-viral-video/
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై శుక్రవారం సాయంత్రం ఓ ప్రయాణికుడు సమోసా కొనుగోలు చేశాడు. అందుకు సంబంధించి ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నించాడు. కానీ ట్రాన్సాక్షన్ ఫెయిలయింది. జేబులో అందుకు సరిపడా చిల్లర లేకపోవడంతో ప్రయాణికుడు మరోసారి యత్నించాడు. ఇంతలో తాను వెళ్లాల్సిన రైలు బయల్దేరడంతో.. ఆ ప్రయాణికుడు చేసేదేం లేక సమోసాను తిరిగి ఇచ్చేశాడు. ఫోన్ పే నుంచి ట్రాన్సాక్షన్ అవ్వట్లేదని.. సమోసా తిరిగి తీసుకోమని చెప్పి యువకుడు రైలు ఎక్కబోయాడు.
దీంతో ఆగ్రహించిన సమోసాల విక్రేత ప్రయాణికుడి కాలర్‌ను పట్టుకుని దారుణంగా వెనక్కి లాక్కొని వెళ్లాడు. ఫోన్ పే ట్రాన్సాక్షన్ అవ్వడం లేదని కస్టమర్ ఎంత నచ్చజెప్పినా వ్యాపారి వినిపించుకోలేదు. డబ్బులు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో.. చివరకు చేసేదేమీ లేక ఆ ప్రయాణికుడు తన వద్ద ఉన్న స్మార్ట్ వాచ్‌ను సమోసా విక్రేతకు ఇచ్చేశాడు. అప్పుడు శాంతించిన అమ్మకందారుడు రెండు సమోసా పొట్లాలు ఇచ్చాడు. దీంతో వెంటనే ప్రయాణికుడు రైలు ఎక్కాడు.
Also Read: https://teluguprabha.net/telangana-news/dgp-shivadhar-reddy-comments-on-riyaz-encounter-nizamabad/
ఇదంతా గమనిస్తున్న అక్కడే ఉన్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి చేరింది. సదరు రైల్వే వ్యాపారిపై కేసు నమోదు చేసి చర్యలకు ఉపక్రమించారు.


