Saturday, November 15, 2025
Homeవైరల్PM Modi Convoy: రోడ్డుపైనే ప్రధాని కాన్వాయ్‌ సర్వీసింగ్‌.. వీడియో వైరల్.. భద్రతా లోపంపై నెటిజన్ల...

PM Modi Convoy: రోడ్డుపైనే ప్రధాని కాన్వాయ్‌ సర్వీసింగ్‌.. వీడియో వైరల్.. భద్రతా లోపంపై నెటిజన్ల ఆగ్రహం..!

PM Modi official convoy were allegedly spotted at a local car Wash: సోషల్ మీడియాలో ప్రధాని మోదీ భద్రతకు సంబంధించిన ఓ వీడియో చక్లర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రధాని భద్రతా లోపంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. త్వరలోనే ఎన్నికలు జరగనున్న బీహార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న వీడియో ప్రకారం, ప్రధాని మోదీ కాన్వాయ్‌లోని కార్లను బీహార్‌ రాష్ట్రం సమస్తీపూర్‌లో రోడ్డు పక్కనే ఉన్న ఓ సాధారణ కారు సర్వీస్ సెంటర్‌లో సర్వీసింగ్‌ చేయించారు. ఈ వీడియోను ఒక నెటిజన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా.. వెంటనే అది కాస్తా వైరల్‌గా మారింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే ప్రధాని కాన్వాయ్ కార్లు బహిరంగంగా శుభ్రం చేయించడంపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ముమ్మాటికి భద్రతా వైఫల్యంగా చెబుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో, ప్రధాని కాన్వాయ్‌లో ఉపయోగించే కార్లలాగే ఉన్న అనేక హై-ఎండ్ బ్లాక్ ఎస్‌యూవీ కార్లను ఓ లోకల్ కార్ వాష్ సెంటర్‌లో శుభ్రం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోను ఆ కార్ వాష్ యజమాని ‘విశ్వకర్మ మోటార్ విజయ్’ స్వయంగా తీసి ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆ పోస్ట్ తొలగించబడినప్పటికీ, నెటిజన్లు దానిని డౌన్‌లోడ్ చేసి షేర్ చేస్తున్నారు.

- Advertisement -

భద్రతా లోపంపై నెటిజన్ల ఆగ్రహం..

ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు షాక్ అవుతున్నారు. ప్రధాని ప్రయాణించే మెర్సిడెస్-మేబాచ్ ఎస్650 గార్డ్ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉన్న వాహనాలు, కేవలం ఎస్‌పీజీ పర్యవేక్షణలో, ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశాలలోనే శుభ్రం చేయాలి. కానీ, ఒక సాధారణ కార్ వాష్‌లో అవి కనిపించడం భద్రతా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక నెటిజన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, “ప్రధాని ప్రయాణించే వాహనం స్థానిక కార్ వాష్‌లో శుభ్రం అవుతుండటం షాకింగ్‌గా ఉంది.. ప్రభుత్వ వ్యవస్థలో దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండవా? ఇది పెద్ద భద్రతా విపత్తుకు దారితీసే ప్రమాదం ఉంది.” అంటూ భద్రతా లోపంపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. మరికొందరు, ఇవి ప్రధాని కాన్వాయ్‌లోని ‘మెయిన్’ వాహనాలు కాకపోవచ్చని, కేవలం ఎస్కార్ట్ వాహనాలు అయి ఉండొచ్చని వాదిస్తున్నారు. అయితే, ప్రధాని కార్యాలయం లేదా సంబంధిత భద్రతా ఏజెన్సీల నుంచి ఈ వీడియోపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, దేశ అత్యున్నత నాయకుడి భద్రతకు సంబంధించిన వాహనాలు ఇలా బహిరంగ ప్రదేశంలో కనిపించడం అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది. భద్రతా సిబ్బంది ఈ విషయంపై ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad