Viral Video: బస్సు, రైలులో కిటికీ పక్కన సీటు దొరికితే చాలు.. ఆ రోజు ప్రపంచాన్నే గెలిచినంత సంబరంగా ఫీలవుతాం. చెవుల్లో ఇయర్‌పాడ్స్ పెట్టుకుని, నచ్చిన పాటలు వింటూ జర్నీని ఎంజాయ్ చేయొచ్చనే ఆశతో చాలా మంది విండో సీటు కోరుకుంటారు. ఇంకా ఓ వైపు ఫోన్ చూస్తూ, మరో వైపు కిటికీలోంచి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే రైల్వే స్టేషన్‌లో ఇలాంటి అనుభూతినే ఆస్వాదిస్తున్న ఓ మహిళకు ఊహించని షాక్ ఇచ్చారు ఓ పోలీసు అధికారి.
రైల్వే స్టేషన్‌లో, కదులుతున్న రైలులో ఎక్కువగా దొంగతనాలు జరగుతుంటాయి. ఇక విండో పక్కన కూర్చున్న ప్రయాణికుల దగ్గర పర్సు అందుకునేలా ఉంటే చాలా చక్యంగా దోచుకుంటారు కొందరు దుండగులు. ఈ క్రమంలో న్యూఢిల్లీలోని ఓ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులో కిటికీ పక్కన సీట్లో కూర్చున ఓ మహిళ ఫోన్ చూస్తుండగా అక్కడే ఉండి ఆమె నిర్లక్ష్య వైఖరిని గమనిస్తున్న ఆర్పీఎఫ్ అధికారి రీతురాజు చౌదరి వెంటనే ఆమె చేతిలో నుంచి ఫోన్ లాక్కున్నారు. షాక్‌కు గురైన ఆ మహిళ వెంటనే పక్కకి తిరిగి అరిచింది. పోలీసును చూడగానే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని నవ్వుతూ ఆయన చేతిలోని తన ఫోన్‌ను తిరిగి తీసుకుంది.
ఈ క్రమంలో రైల్వే స్టేషన్లలో నిత్యం జరిగే స్నాచింగ్ సంఘటనలపై ఆర్పీఎఫ్ అధికారి రీతు రాజు చౌదరి ఆ మహిళను అప్రమత్తం చేశారు. రైల్లో విండో సీటు వద్ద కూర్చున్నప్పుడు దొంగతనాలు జరిగే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పోలీసుల పనితీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


