Pet monkey inherits fortune in Raebareli : రూపాయి రూపాయి కూడబెట్టి కన్నబిడ్డల కోసం దాచిపెట్టే స్వార్థపూరిత లోకమిది. అలాంటి సమాజంలో.. కన్నపేగు కాకపోయినా, కనీసం మనిషి కూడా కాని ఓ మూగజీవికి ఎవరైనా కోట్ల రూపాయల విలువైన యావదాస్తిని రాసిస్తారా? వినడానికే వింతగా, నమ్మడానికే అసాధ్యంగా అనిపించే ఈ అపురూప ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో చోటుచేసుకుంది. కేవలం రూ.500 పెట్టి తెచ్చుకున్న ఓ అనాథ కోతిపిల్ల.. నేడు కోట్లకు పడగలెత్తిన ‘కోటీశ్వరుడు’ ఎలా అయ్యాడు? రక్తసంబంధీకులను కాదని ఓ వానరానికి తమ సర్వస్వాన్ని ధారపోయడానికి ఆ దంపతులను పురిగొల్పిన బలమైన కారణమేంటి?
ఒంటరితనంలో దొరికిన ఓదార్పు: ఉత్తరప్రదేశ్‌కు చెందిన బ్రజేష్ శ్రీవాస్తవ, షబిస్తాలది కులాంతర, మతాంతర వివాహం. పెద్దలను ఎదిరించి ఒక్కటైనందుకు సమాజం వారిని వెలివేసింది.ఏళ్ల తరబడి ఒంటరితనం, పిల్లలు లేని వెలితి వారిని కుంగదీసింది. సరిగ్గా అదే సమయంలో.. 2005లో తల్లి కోతి విద్యుదాఘాతానికి గురై చనిపోగా, అనాథగా మారిన నెల రోజుల కోతిపిల్లను రూ.500 చెల్లించి తెచ్చుకున్నారు. దానికి ‘చున్మున్’ అని నామకరణం చేసి కంటికి రెప్పలా సాకడం మొదలుపెట్టారు.
చున్మున్ తెచ్చిన అదృష్టం.. కళ్లు చెదిరే రాచభోగాలు : ఆ జంట నమ్మకం ప్రకారం చున్మున్ ఇంట్లోకి వచ్చాకే వారి రాత మారింది. అప్పటివరకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్రజేష్ వ్యాపారాల్లో రాణించగా, షబిస్తా న్యాయవాదిగా స్థిరపడ్డారు. చున్మున్ను కన్నకొడుకులా చూసుకుంటూ రాచమర్యాదలు కల్పించారు.
విలాసవంతమైన జీవనం: చున్మున్ కోసం ఇంట్లో ప్రత్యేకంగా ఏసీ గది, శీతాకాలంలో చలి తాళలేడని ప్రత్యేక హీటర్లు ఏర్పాటు చేశారు. రోజువారీ పండ్లతో పాటు వేడివేడి టీ, మామిడి రసం, చౌమీన్, చిల్లీ పన్నీర్ వంటి చైనీస్ వంటకాలను వడ్డిస్తారు. 2010లో ‘బిట్టి’ అనే ఆడ కోతితో వందలాది మంది బంధుమిత్రులను పిలిచి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు.
కోట్ల ఆస్తి ట్రస్ట్‌కు.. అసలు లక్ష్యం ఇదే: సాధారణంగా కోతులు 35 నుంచి 40 ఏళ్లు జీవిస్తాయి. తమ తర్వాత చున్మున్, బిట్టిల పరిస్థితి అగమ్యగోచరం కాకూడదనే ఉద్దేశంతో ఈ దంపతులు విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. తమ పేరిట ఉన్న ఇల్లు (‘చున్మున్ భవన్’), స్థలాలు, బ్యాంకు డిపాజిట్లను కలిపి ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, యావదాస్తిని దానికి అప్పగించారు. ఈ ట్రస్ట్ నిధులు చున్మున్, బిట్టిల పోషణకే కాకుండా.. అడవులు నశించి ఆకలితో అలమటిస్తూ నగరాల్లోకి వచ్చే ఇతర కోతుల సంరక్షణకు, వాటి దాహార్తిని తీర్చడానికి ఉపయోగపడతాయని దంపతులు స్పష్టం చేశారు. “మమ్మల్ని పిచ్చివాళ్లని ఎగతాళి చేసినా ఫర్వాలేదు.. చున్మున్ మా ప్రాణం” అని వారు చెబుతున్న మాటలు మూగజీవులపై మనుషులకుండే అపరిమిత ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

