Hyderabad Viral video: తెలుగు రాష్ట్రాల్లో మ్యాన్ హోల్స్ లో పడి మరణించిన ఘటనలు అనేకం చూశాం. అధికారుల నిర్లక్ష్యం తాజాగా ఓ చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది. హైదరాబాద్ లోని పాతబస్తీ యాకుత్‌పురాలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..
ఓ పాప ఎప్పటిలాగే స్కూల్ కు వెళ్తుంది. అయితే తెరచి ఉన్న డ్రైనేజీ మూతను చూసుకోకుండా అటుగా వెళ్తుంది. సడన్ గా కాలు జారి అందులో పడిపోతుంది. పక్కనే ఉన్న ఆ బిడ్డ తల్లి డ్రైనేజ్ లో పడటం చూసింది. వెంటనే పరిగెత్తుకు వెళ్లి అందులో పడిన బాలికను బయటకు తీసింది. అంతలో అక్కడకు వచ్చిన స్థానికులు పుస్తకాలు బయటకు తీశారు. ఆ పాప క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని మండిపడుతున్నారు. పాప బతికి బయటపడింది కాబట్టి సరిపోయింది, ఆ చిన్నారికి ఏదైనా జరిగి ఉంటే పరిస్థితి ఏంటి ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
మ్యాన్ హోల్ మూత తెరిచి ఉంచితే భారీ జరిమానాతోపాటు క్రిమినల్ కేసు నమోదు చేస్తామని వాటర్ బోర్డు అధికారులు హెచ్చరించినా.. నగరంలో చాలా చోట్ల మ్యాన్ హోల్ మూతలు తెరిచి ఉంచటం గమనార్హం. ఇప్పటికే సిటీ వ్యాప్తంగా 25 వేలకుపైగా మ్యాన్ హోళ్లపై సేఫ్టీ గ్రిల్స్ బిగించారు. ప్రధాన రూడ్లపై ఉన్న వాటిని కవర్స్ తో సీల్ చేసి రెడ్ పెయింట్ వేశారు. వరద నీటిని తొలగించాలనే క్రమంలో మ్యాన్ హోల్స్ ను తెరచి ఉంచుతున్నారు. ఎవరైనా పౌరులు లేదా అనధికార వ్యక్తులు అధికారులు అనుమతి లేకుండా మ్యాన్ హోళ్ల పై ఉన్న మూత తెరిస్తే HMWSSB ACT – 1989, సెక్షన్ 74 ప్రకారం శిక్షిస్తారు. జరిమానాతోపాటు జైలుశిక్ష కూడా విధిస్తారు.
Also Read: Viral Video – ఇంట్లోకి దూరిన భయంకరమైన పాము.. ఈ బుడ్డది ఎలా బయటకు పంపించిందో చూశారా?
తాజా ఘటనతో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మ్యాన్ హోల్ కావాలనే తెరిచి వదిలేశారా, వరద నీటితో మునిగిపోవడంతో తెరిచారా, ఎందుకు అక్కడ హెచ్చరిక బోర్డు పెట్టలేదు, నాలా నిర్వహణ బాధ్యత ఎవరిది, జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు అని రక రకాల ప్రశ్నలు సంధిస్తున్నారు స్థానికులు.


