Shantanu Naidu on AI Saree Trend: ప్రస్తుతం ఏఐ గూగుల్ జెమినీ ఏఐ నానో బనానా ఫొటో ఎడిటింగ్ టూల్ ట్రెండ్ అవుతోంది. ఈ యాప్ సాయంతో చాలా మంది తమ ఫొటోలను ప్రాంప్ట్ ఇచ్చి రెట్రో శైలిలో ఎడిట్ చేసి వాటిని చూసి సంబరపడిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు యాప్ సాయంతో శారీల్లో ఉన్న ఫొటోలను షేర్ చేసుకుంటున్నారు. దీనిపై తాజాగా దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా మిత్రుడు శంతను నాయుడు సోషల్ మీడియా వేదికగా పలు విమర్శలు చేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో గూగుల్ జెమినీ నానో బనానా ఇమేజ్ ఎడిటింగ్ టూల్ ద్వారా యూజర్లు తమ ఫొటోను అప్‌లోడ్ చేసి, 1990ల శైలిలో సొగసైన చీరలు, జ్ఞాపకాల నేపథ్యాలతో తమకు నచ్చినట్టుగా మార్చుకుంటున్నారు. దేశంలో ఎక్కడ చూసినా నానో బానానా ట్రెండే నడుస్తోంది. చీరల్లో ఉన్న ఫొటోలను నానో బనానా టూల్‌తో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. దీనిపై శంతను నాయుడు ఇన్‌స్టా వేదికగా తనదైన శైలిలో సెటైర్లు వేయగా.. ఇది నెట్టింట వైరల్ అవుతోంది.
‘భారతదేశం చీరలకు పుట్టినిల్లు. మీ బీరువాల్లో చూసుకుంటే కనీసం 15 చీరలు కనిపిస్తాయి. మీరంతా ఉన్నది భారత్‌లో.. అమెరికాలో కాదు? మీ వద్ద ఉన్న చీరలను కట్టుకుని ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు కదా. ఏఐ చీరలు ఎందుకు వినియోగిస్తున్నారు. ఈ మాత్రం కూడా చేయలేనంత బద్ధకస్తులుగా తయారయ్యారా? మీ కప్ బోర్డుల్లో ఉన్న చీరలను కాదని ఏఐతో ఫొటోలు చేసుకుని సంబరపడిపోతున్నారా?’ అని శంతను నాయుడు తీవ్రంగా విమర్శలు చేశారు.
Also Read: https://teluguprabha.net/viral/lovers-romance-in-running-train-video-goes-trending-on-social-media/
పాశ్చాత్య దేశాల్లో వివాహ సమయంలో ధరించే తెల్లటి గౌన్లు మీరు వేసుకున్నట్టు ఫొటోలు ఎడిట్ చేసి షేర్ చేసినా అంతగా తప్పుబట్టాల్సి ఉండేది కాదని శంతనునాయుడు అభిప్రాయపడ్డారు. ఇలా చేయడం కంటే ఇంట్లో అమ్మ చీర కట్టుకుని ఫొటోలు దిగితే మరింత అందంగా కనిపిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. శంతను నాయుడు పోస్ట్ చేసిన వీడియోపై నెటిజన్లు స్పందించారు. ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తూ.. తమ మనసులో ఏముందో శంతను అదే చెప్పారని కామెంట్ చేస్తున్నారు.


