Minor Car Driving viral video: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నుంచి ఓ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. ఓ మైనర్ బాలుడు కారుతో మూడేళ్ల బాలికపై దూసుకెళ్లాడు. దీంతో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వీడియో ఓపెన్ చేస్తే.. బుధవారం నాడు అహ్మదాబాద్‌లోని నోబుల్ నగర్ ప్రాంతంలో ఓ మూడేళ్ల చిన్నారి తన ఇంటి బయట వీధిలో ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలో ఓ 15 ఏళ్ల బాలుడు స్విఫ్ట్ కారును నడపటానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఆ బాలుడు కారును కంట్రోల్ చేయలేక వీధిలో ఆడుకుంటున్న బాలికపై పోనిచ్చాడు. ఆ చిన్నారి కారు కింద చిక్కికిపోయి ఏడుస్తూ కనిపించింది. ఆ చిన్నారికి ప్రాణాపాయం తప్పింది కానీ తీవ్రంగా గాయపడింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.
బాలిక ఏడుస్తూ కారు కింద నుంచి బయటకు వచ్చిన సమయంలో చుట్టుపక్కల ఉన్న వారంతా అక్కడకు చేరుకున్నారు. బాలిక తల్లి ఆ యువకుడిని చితకబాదారు. చుట్టుపక్కల వారు కూడా అతడిని కొట్టారు. ఆ చిన్నారి దివ్యను స్థానికంగా ఉన్న చంద్ఖేడాలోని శారదా ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆమె కాళ్లుకు, చేతులకు తీవ్రంగా గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. చిన్నారి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు చెబుతున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 15 ఏళ్ల బాలుడు లైసెన్స్ లేకుండా కారు నడిపాడని పోలీసు దర్యాప్తులో తేలింది. పోలీసులు ఆ బాలుడిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 279 (నిర్లక్ష్యంగా వాహనం నడపడం) మరియు 337 (గాయం కలిగించడం) కింద కేసు నమోదు చేశారు. మైనర్ కారు నడపడానికి వారు ఎలా అనుమతించారనే దానిపై అతని తల్లిదండ్రులను కూడా ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు మరియు దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read: Viral Video -ట్రైన్ లో సీటు కోసం పెప్పర్ స్ప్రే కొట్టిన యువతి.. కట్ చేస్తే..!
ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదం కాదు, నిర్లక్ష్యానికి ఉదాహరణ అంటూ ఒకరు కామెంట్ చేస్తే.. ఆ పిల్లాడిని కారు నడపటానికి అనుమతించినందుకు ఆ తల్లిదండ్రులను జైలుకు పంపాలని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఆ మూడేళ్ల చిన్నారిని వీధిలో ఆడుకోవడానికి ఒంటరిగా ఎందుకు వదిలేశారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. తాజా ఘటన అనేక ప్రశ్నలకు దారి తీసింది.


