Viral Video Mother And Son: పున్నామ నరకం నుంచి రక్షించేవాడే పుత్రుడు అని అంటారు. కానీ ప్రస్తుత తరంలో బతికుండగానే కొందరు సుపుత్రులు కన్నవారికి చూపించే నరకం కంటే చచ్చాక చేరుకునే పున్నామ నరకమే నయం అనిపిస్తుంటుంది. నవమాసాలు మోసి కని ఉన్నతంగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను చివరి క్షణాల్లో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి వృద్ధాశ్రమాల్లో పడేసి భారం దించుకుంటున్నారు. అలాంటి వారు ఈ వీడియో చూస్తే కొంచెమైనా కనువిప్పు కలుగుతుందేమో..
Also Read: https://teluguprabha.net/viral/rickshaw-wala-giving-money-to-the-car-owner-for-mistake-viral-video/
పెరుగుతున్న ఖర్చులు, మారుతున్న జనజీవన శైలికి అనుగుణంగా ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తే కానీ నడవదు. బయటకు వెళ్లడం వీలు కాని మహిళలు ఇంట్లోనే ఉండి చిరు వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబానికి అండగా ఉంటున్నారు. ఇక మెట్రో నగరాల్లో అయితే ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా మహిళలు తమ ఇంటిపనులను చక్కదిద్దుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉద్యోగ ధర్మం నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ‘నిద్ర’ అనే అమూల్యమైన ఆరోగ్య సూత్రాన్ని విస్మరించాల్సి వస్తోంది.
అందుకే ఈ తల్లి కష్టం గమనించాడో ఏమో.. ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లే టైం గ్యాప్‌లో కాసేపు కునుకు తీస్తున్న తన మాతృమూర్తికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. తన చిట్టి చేతుల్లో అమ్మను జాగ్రత్తగా పట్టుకున్నాడు. కిందపడిపోకుండా కాపలా కాశాడు. కోల్‌కతా మెట్రో ట్రైన్‌లో జరిగిన ఇటీవల జరిగిన ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
రోజంతా కష్టపడి అలసిపోయిన ఓ మహిళ తన కొడుకుతో కలిసి మెట్రో రైలులో ఇంటికి వెళ్తున్న ఓ మహిళకు.. మధ్యలోనే కునుకు పట్టేసింది. దీంతో ఆమె అలాగే నిద్రపోయింది. కదులుతున్న వాహనాల్లో నిద్ర పోయేటప్పుడు మధ్యలో అలికిడి అయితే అకస్మాత్తుగా కిందపడిపోతుంటారు. ఇది గమనించిన ఆమె కుమారుడు.. తన తల్లికి దొరికిన ఆ కాసింత టైంలో ఆమెకు ప్రశాంతంగా రెస్ట్ ఇవ్వాలని అనుకున్నాడు. అందుకే అమ్మ పక్కకు వాలిపోకుండా రెండు చేతులతో సున్నితంగా ఆమె తల చుట్టూ చేతులేసి రాడ్డును పట్టుకున్నాడు. దీంతో ఆమె ఏ దిగులూ లేకుండా కాసేపు హాయిగా కునుకు తీసింది.
On public transport, a child protects his mother who looks exhausted and falls asleep, and the child takes care of her while she can rest a little. 💕 pic.twitter.com/LGxpfZBXBK
— The Figen (@TheFigen_) September 3, 2025
ఈ వీడియో చూసిన నెటిజన్లు.. తల్లి పట్ల ఆ బుడ్డోడికి ఉన్న ప్రేమను చూసి ఫిదా అవుతున్నారు. జీవితాంతం కన్న తల్లిని ఇలాగే చూసుకోవాలని ఆశీర్వదిస్తున్నారు. ఈ వీడియో ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించడంతో లైక్స్ అండ్ కామెంట్స్ చేస్తూ షేర్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియో దాదాపు 1 మిలియన్ వ్యూస్‌ను దాటేసింది.


