South Korea-Knee Pain: దక్షిణ కొరియాలో ఒక 65 ఏళ్ల మహిళ చాలా కాలంగా మోకాళ్ల నొప్పితో బాధపడుతూ వచ్చింది. వైద్యులు ఆమెకు ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నట్లు నిర్ధారించారు. ఈ వ్యాధి క్రమంగా కీళ్లలోని మృదులాస్థి అరిగిపోవడానికి కారణమవుతుంది. ఫలితంగా నడవడం, కూర్చోవడం, మెట్లు ఎక్కడం వంటి పనులు చాలా కష్టంగా మారతాయి. ఆ మహిళ పరిస్థితి కూడా ఇలాగే విషమించడంతో మొదట్లో ఆమెకు సాధారణంగా సూచించే మందులు ఇచ్చారు.
నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ..
ఆమె మొదట నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు వాడింది. తరువాత నొప్పి తగ్గకపోవడంతో స్టెరాయిడ్ ఇంజెక్షన్లు కూడా వేసుకుంది. అయినప్పటికీ నొప్పి పూర్తిగా తగ్గలేదు. ఇంతే కాదు, మందుల వలన కడుపు నొప్పి కూడా పెరగడం ప్రారంభమైంది. ఈ దుష్ప్రభావాలతో విసిగి ఆమె మందులు మానేసి మరో ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకుంది.
నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు..
ఆమె ఆక్యుపంక్చర్ వైద్యానికి మొగ్గుచూపింది. వారానికి ఒకసారి సూదులు పెట్టించుకోవడం మొదలుపెట్టింది. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు వారంలోనే అనేక సార్లు ఆక్యుపంక్చర్ చేయించుకుంది. కొన్ని నెలల పాటు ఇలా చికిత్స కొనసాగించినా, మోకాళ్ల నొప్పి తగ్గకపోగా మరింత తీవ్రమైంది. చివరికి ఆమెను మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది.
వందల సంఖ్యలో బంగారు తీగలు..
ఆసుపత్రిలో వైద్యులు ఎక్స్‌రే పరీక్షలు చేశారు. ఫలితాలు చూసి వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఆమె ఎడమ మోకాలిలో వందల సంఖ్యలో బంగారు తీగలు కనిపించాయి. మోకాలి చుట్టుపక్కల గూడ్చి ఉన్న ఈ తీగలు గమనించి వైద్యులు పరిశీలించగా, అవి గోల్డ్ థ్రెడ్ ఆక్యుపంక్చర్ పద్ధతిలో ఉపయోగించే తీగలేనని గుర్తించారు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య..
ఈ బంగారు తీగలు శరీరంలో సహజసిద్ధమైనవి కావు. ఒక ప్రత్యేకమైన చికిత్సా విధానంలో భాగంగా చర్మం లోపల నాటుతారు. వైద్యుల వివరణ ప్రకారం, ఆసియా దేశాల్లో ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యలకు ఈ గోల్డ్ థ్రెడ్ ఆక్యుపంక్చర్ వాడుతున్నారు. కానీ ఈ విధానం నిజంగా పనిచేస్తుందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేవు.
ఆమె ఎక్స్‌రేలో మరో విషయం కూడా బయటపడింది. మోకాలి కీళ్ల లోపల షిన్‌బోన్ మందంగా గట్టిపడింది. అలాగే షిన్‌బోన్, తొడ ఎముక కలిసే ప్రాంతంలో ఎముక స్పర్స్ ఏర్పడుతున్నాయి. ఇవి నొప్పిని మరింత పెంచే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.
గోల్డ్ థ్రెడ్ ఆక్యుపంక్చర్..
గోల్డ్ థ్రెడ్ ఆక్యుపంక్చర్ పద్ధతిలో బంగారు తీగలను శరీరంలో వదిలేయడం వలన అనేక రకాల సమస్యలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తీగలు లోపల శాశ్వతంగా ఉండిపోవడం వలన కణజాలాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ తీగలు చుట్టుపక్కల కణజాలాన్ని గాయపరచవచ్చు. అంతేకాదు శరీరంలోని ఇతర భాగాలకూ చేరే ప్రమాదం ఉంటుంది.
అలా జరిగితే శరీరంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇంకా ఈ పద్ధతిని ఆశ్రయించడం వలన, రోగులు అసలు వైద్య చికిత్సను వాయిదా వేసి పరిస్థితి మరింత క్షీణించుకునే అవకాశమూ ఉందని నిపుణులు వివరించారు.


